విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టులు జారీచేసే విషయంలో తమ దగ్గరున్న డేటాబేస్ ఆధారణంగా విచారణ చేస్తామని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. అనంతరం ఆ వ్యక్తులకు తమ దగ్గర నుంచి పాస్‌పోర్టు జారీకి అనుమతులు మంజూరు చేస్తామని వివరించారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదై ఉంటే ఆ విషయాలను ప్రధానంగా పరిశీలిస్తామని సీపీ పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ఏడాదికి 23 వేల పాస్ పోర్టుల వరకు విచారణ చేస్తున్నామన్న శ్రీనివాసులు.. గతేడాది కరోనా కారణంగా 15 వేల పాస్ పోర్టు దరఖాస్తుల విచారణ చేశామన్నారు.
ఓ వ్యక్తి పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేయగానే.. ఆ దరఖాస్తులన్నీ సంబంధిత పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు చేరుతాయి. అనంతరం దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తారు. ముఖ్యంగా ఆ వ్యక్తి.. చిరునామా, విద్యార్హతలు, ధ్రువపత్రాలు, నేరచరిత్రలపై.. పూర్తిగా డేటా నమోదు చేసుకుంటారు. దరఖాస్తుదారుని ఇంటి పక్కన వాళ్లను సైతం ఆ వ్యక్తి గురించి అడిగి వివరాలు సేకరిస్తారు. అనంతరం అతని వివరాలను పోలీసుల వద్ద ఉన్న నేరస్తుల డేటాతో పోల్చి చూస్తారు. ఇంటెలిజెన్స్, ఇంటర్ పోల్ వారి నుంచి సైతం క్లియరెన్స్ తీసుకుంటారు.
పోలీసుల విచారణ తర్వాత వారిచ్చే నివేదిక ఆధారంగా అధికారులు పాస్‌పోర్టు జారీ చేస్తారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిర్ధారణ అయితే.. ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఇలా తిరస్కరణకు గురైన దరఖాస్తులు చాలా తక్కువేనని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: