కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రభుత్వం రూపొందించే నూతన విధానం...వాస్తవిక దృక్పథంతో ఉండాలన్నారు. ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేర్చేలా, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. పరిశ్రమలకు భూమి, నీరు, కరెంటు ఇస్తూనే...నాణ్యమైన సేవలు అందించాలని నిర్దేశించారు.
ఆ పరిశ్రమలకు మరింత తోడ్పాటు
భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల వారీగా ఎంతమంది ఉద్యోగులు ఆధారపడ్డారనే వివరాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 4వేల 800 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులపై చర్చించారు. దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఉపాధి కల్పన ఆధారంగా పరిశ్రమలను కేటగిరీలుగా విభజించి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.
పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంపై కొవిడ్–19 ఏ స్థాయిలో ప్రభావం చూపిందనే అంశంపై అధికారులతో సీఎం చర్చించారు. రాష్ట్ర పరిశ్రమలపై పడే ప్రభావంపైనా సమాలోచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని, మారుతున్న పరిణామాల్ని అంచనా వేస్తూ ముందుకు సాగాలని నిర్దేశించారు. రాష్ట్ర పారిశ్రామికరంగ వృద్ధికి తోడ్పడే వివిధ కేటగిరీల పరిశ్రమలపైనా కసరత్తు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొవిడ్ ప్రభావాన్ని అంచనా వేస్తోందని, త్వరలోనే ఒక విధానం వెలువడే అవకాశం ఉందన్నారు.
వైఎస్సార్ నిర్మాణ్ ఆవిష్కరణ
కాలుష్య నివారణకు పెద్దపీట వేయాలని, పరిశ్రమల నుంచి కాలుష్యాన్ని సున్నా స్థాయికి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. పారిశ్రామిక వ్యర్థాలను సేకరించి, కాలుష్యం లేకుండా చూసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. సమాజానికి, ప్రభుత్వానికి మేలు జరిగేలా కాలుష్య నివారణా విధానం ఉండాలన్నారు. డీశాలినేషన్ చేసిన నీరు వినియోగించేలా పరిశ్రమలకు ఇదివరకే సూచించామని, ఆ విధానంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. లాక్‌డౌన్ దృష్ట్యా నిత్యావసరాల తయారీ సంస్థల నమోదు కోసం "వైఎస్సాఆర్ నిర్మాణ్" పేరిట పరిశ్రమలశాఖ రూపొందించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఇదీచదవండి