Illegal activities in Apartments: విజయవాడలోని పలు సర్వీసు అపార్ట్‌మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా అపార్ట్‌మెంట్ గదులను అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వీటిని కొనసాగిస్తున్నారు. యువతీ, యువకులకు గంటల చొప్పున అద్దెకు ఇస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఈ విష సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల ఓ ప్రేమ జంట కేసు విచారణ సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎక్కువ ఆదాయం కోసం..
ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో జూదం, వ్యభిచారం, తదితర వ్యవహారాలు నడిపే వారికి ఫ్లాట్లను అద్దెకు ఇస్తున్నారు. గంటకు 2 నుంచి 3 వేల రూపాయల వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తున్నారు. వీటిలో సకల సదుపాయాలు సమకూరుస్తున్నారు. బిర్యానీ, శీతల పానీయాలు, మద్యం సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా ఈ ఫ్లాట్లకు ప్రేమికులే వస్తుంటారని.. ఈ వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. లాడ్జీలు, హోటళ్లపై నిఘా ఉంటుందని అపార్ట్‌మెంట్లలో అయితే పెద్దగా అనుమానం రాదనే కారణంతో వీటిని ఎంచుకుంటున్నారు. కొందరు పోలీసు సిబ్బంది నెలవారీ మామూళ్లకు కక్కుర్తి పడటం, వారికి తెలిసే ఈ వ్యవహారం సాగుతోందనే విమర్శలూ ఉన్నాయి.
ఇటీవల ఓ ప్రేమజంట వ్యవహారంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను పలు అపార్ట్‌మెంట్లకు తీసుకెళ్లాడని యువతి చెప్పడంతో ఆ అపార్ట్‌మెంట్ల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.
యువతి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పటమట స్టేషను పరిధిలోని 5, భవానీపురం స్టేషను పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లను గుర్తించారు. ఇలాంటి కార్యకలాపాలు ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆ ఫ్లాట్లకు ఎంత మంది వెళ్తున్నారు? ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు? తదితర అంశాలపై దృష్టి సారించారు. ఆయా ఫ్లాట్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్న చోట్ల వాటిల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
తెదేపా నేతల వాహనాలను అడ్డుకున్న పోలీసులు.. కార్యకర్తల ఆందోళన