విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో అసంబద్ధంగా ఉందన‌్న హైకోర్టు..దీనివెనుక దురుద్దేశాలు ఉన్నట్లు అభిప్రాయపడింది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులోని సెక్షన్-8 ప్రకారం ప్రతిపాదిత మూడు రాజధానుల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు ప్రక్రియ విఫలమైనందున...జీవో జారీతో కర్నూలులో కార్యాలయాల తరలింపునకు ప్రభుత్వం దగ్గరి దారిని అనుసరించిందని ఆక్షేపించింది. శాసనమండలిలో బిల్లు పెండింగులో ఉన్నప్పటికీ కార్యాలయాల తరలింపు కోసం ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని తప్పుబట్టింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవో జారీకి నోట్ ఫైల్ షీట్ ముఖ్యమంత్రి నుంచి నేరుగా వచ్చినట్లుందని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో సాధారణంగా న్యాయస్థానాల జోక్యం ఉండదన్న హైకోర్టు ధర్మాసనం..రాజకీయ ప్రేరణ, దురుద్దేశాలతో కూడిన నిర్ణయాల్లో తప్పదని అభిప్రాయపడింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై కార్యనిర్వహణ అధికారుల చర్య... చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ చట్టం- 2016 అమల్లో ఉండగా... కార్యాలయాల తరలింపు సాధ్యంకాదని స్పష్టంచేసింది . అమరావతి సచివాలయంలో సరిపడనంత స్థలం లేదన్నది సాకు మాత్రమేనన్న న్యాయస్థానం... నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే రాజధానికి వంద కిలోమీటర్ల లోపే ఉన్న గుంటూరు, విజయవాడ, ఏలూరులో ఏర్పాటుచేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. కర్నూలులో కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలం చూడాలని ఆ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఎలాంటి లేఖ రాయలేదని గుర్తుచేసింది. కార్యాలయాలకు అనువైన భవనాలను సూచిస్తూ సీఎం, సీఎస్‌కు కలెక్టర్ లేఖ రాశారని... అది తనంతట తాను రాశారా లేదా ఎవరి ప్రోద్బలమైనా ఉందా అని అనుమానం వెలిబుచ్చింది.
సుమారు 300 కిలోమీటర్లకు పైగా దూరమున్న కర్నూలులో విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీ కార్యాలయాలను ఏర్పాటుచేస్తే... విచారణల కోసం ప్రజలు అంతదూరం ఎలా వెళతారనే అంశాన్ని ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది.
ఇదీచదవండి