మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్లు ఎం.మురళీమోహన్, కిశోర్ దుగ్గిరాల, ఎం.రాంమ్మోహనకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులో దర్యాప్తుతోపాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రతివాదులుగా ఉన్న సీఐడీ పోలీసులు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీచేసింది. విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
తమ భూమిలో గృహ సముదాయ నిర్మాణ నిమిత్తం చేసుకున్న ఒప్పందం మేరకు నిర్మాణం చేపట్టలేదని, అగ్రిమెంట్‌ను ఉల్లంఘించారని జయభేరి సంస్థ, డైరెక్టర్లపై భూయజమాని యార్లగడ్డ రవికిరణ్ సీఐడీకి ఫిర్యాదు చేయగా.. ఆగస్టు 2న కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు నిమిత్తం సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఏ కింద డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని జయభేరి ప్రాపర్టీస్ డైరెక్టర్లు మురళీ మోహన్, తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అగ్రిమెంట్ నిబంధనలను పిటిషనర్లు ఉల్లంఘించలేదని పిటీషనర్ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. డెవలప్మెంట్ ఒప్పందం ప్రకారం ఇంకా సమయం ఉందన్నారు. వాస్తవానికి ఇది సివిల్ వివాదమని... క్రిమినల్ స్వభావ వివాదంగా మార్చి సీఐడీ కేసు నమోదు చేయడం తగదన్నారు. దర్యాప్తును నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి .. మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి: