ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తుండటంతో తెలంగాణలోని కాళేశ్వరం బ్యారేజీల్లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. వరద పెరగడం వల్ల రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోస్తున్నారు. గోదావరి జలాల ఎత్తిపోతలు ఐదు రోజులుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ (srsp), ఎల్‌ఎండీ (lower manair dam), మధ్యమానేరు జలాశయాల ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలనే లక్ష్యంతో జలాల తరలింపు చేపట్టారు. నంది పంపుహౌస్‌లోని నీటిని ఎత్తిపోసే మోటార్ల సంఖ్యను నాలుగుకు పెంచి ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగించారు.
దిగువ మానేరుకు జలాలు..
ఎల్లంపల్లి జలాశయం నుంచి 12,600 క్యూసెక్కుల జలాలు నంది మేడారం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. అంతే ప్రవాహాన్ని గాయత్రి పంపుహౌస్‌కు వదులుతున్నారు. గాయత్రి పంపు నుంచి మధ్య మానేరుకు నీటిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉన్న మాధ్యమానేరుతో పాటు దిగువ మానేరు జలాశయానికి నీటిని చేరవేస్తున్నారు. మధ్యమానేరు నుంచి 9గేట్లు స్లూయిజ్ గేట్ల ద్వారా ఎల్ఎండీకి నీటిని తరలిస్తున్నారు.
ఇదీ చదవండి: APSRTC: రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం