హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన వర్షం అర్ధ గంట పాటు పడింది. అనంతరం మళ్లీ ప్రారంభమైంది. జీడిమెట్ల, బాలానగర్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
పాతబస్తీ, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, ఖైరతాబాద్‌లో మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బేగంపేట్, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బోయినపల్లి, ప్యారడైజ్, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి
మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించారు. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.