Digital Ration Cards: వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా సర్వీసులు అందజేయాలన్నదే తమ ఆశయమన్నారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా ఆయన వాట్సప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు మనం కల్పిస్తున్న ఒక మంచి వేదికని, దాన్ని మరింత ప్రజోపయోకరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఆయా శాఖలన్నీ కూడా తమ డేటాను ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేసి సహకారం అందివ్వాలని కోరారు.
అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే: వాట్సప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయాలంటే ఆయా శాఖల సహకారం చాలా అవసరమన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చాలా కీలక ప్రక్రియ అన్నారు. అధికారులు తమ శాఖల్లో ఈ దిశగా సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో అన్ని సేవలు ఆన్‌లైన్ చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆశయమన్నారు. రేషన్ కార్డుల మొదలు అన్నీ కూడా ప్రజలకు చాలా సులభంగా ఆన్‌లైన్‌లోనే అందించే దిశగా దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
డిజిటల్ రేషన్ కార్డులు: రాబోయే రోజుల్లో పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని, తద్వారా పౌరులు క్యూఆర్ కోడ్‌తోనే రేషన్ పొందే సదుపాయం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సప్ ద్వారానే మదింపు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. అన్ని శాఖలు వాట్సప్ గవర్నెన్స్‌లో ఇంటిగ్రేటెడ్ అవ్వాలన్నారు.
భాగస్వామ్యం, సహకారంతోనే విజయవంతం చేయగలం: ఒక పౌరుడు ఒక ఆలయానికి వెళ్లాలనుకుంటే వాట్సప్‌లోనే ఆలయంలో దర్శనం, ఆర్జిత సేవలు పొందడం, వసతి పొందడం, రవాణా అన్నీ కూడా వాట్సప్‌లో అనుసంధానమవ్వాలన్నారు. ఇవన్నీ చేయాలంటే ఆయా శాఖలు తమ ఐటీ విభాగాలను సాంకేతికంగా మెరుగుపరచుకుని తమకు తగిన సహకారం అందివ్వాలని సూచించారు. అందరి భాగస్వామ్యం, సహకారంతోనే దీన్ని విజయవంతం చేయగలుగుతామన్నారు.
క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు - దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే?