Devotees Rush at Medaram: తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అమ్మవార్లను దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో సమ్మక్క-సారలమ్మ దర్శించుకునేందుకు వచ్చారు. మేడారం వెళ్లే భక్తులంతా ముందుగా ములుగు జిల్లా కేంద్రానికి ప్రేమ్ నగర్ సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. కరోనా దృష్ట్యా ముందస్తుగానే సమ్మక్క-సారలమ్మ దర్శించుకునేందుకు వస్తున్నామని భక్తులు తెలిపారు.
గట్టమ్మ సన్నిధిలో భక్తుల కోలాహలం..
Gattamma temple at Mulugu : ములుగు గట్టమ్మ తల్లి దేవాలయంలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క-సారలమ్మ కంటే ముందు ఇక్కడి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఫిబ్రవరి ఏడో తారీఖున ఇక్కడ సమ్మేళనం జరపనున్నట్లు గట్టమ్మ పూజారులు ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. బోనాలు, కనువిందు చేసే నృత్యాలతో ఎదురు పిల్లపండగ జరుపుతామని తెలిపారు.
కరోనా కారణంగా సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం ముందే వస్తున్నాం. జాతరకు ప్రతీసారి తప్పకుండా వస్తాం. ముందుగా వరంగల్‌లో రామప్ప, వేయిస్తంభాల గుడి, గట్టమ్మ దేవాలయం దర్శించుకుంటాం. ఆ తర్వాత మేడారానికి వెళ్తాం. ఈసారి మాత్రం కరోనా వల్ల డైరెక్ట్‌గా గట్టమ్మ దగ్గరకే వచ్చాం.
-సుష్మ, భక్తురాలు, హైదరాబాద్
మేడారం జాతరకు వస్తే మాకు మంచిగ అనిపిస్తది. అందుకే ప్రతీసారి వస్తాం. ఏం మొక్కుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి. అందుకే ప్రతీసారీ వచ్చి.. మొక్కులు చెల్లించుకుంటాం. కరోనా ఉన్నా కూడా చాలామంది వస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి పోయేముందు గట్టమైసమ్మను దర్శించుకుంటాం.
-సుజాత భక్తురాలు, వరంగల్
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారక్క జాతరకు దాదాపు కోటి మంది భక్తులు వస్తారు. భక్తులు వెళ్లేదారిలో గట్టమ్మ తల్లి దేవాలయాలు ఏడు ఉంటాయి. ములుగు గట్టమ్మ తల్లికి ఆదివాసీ నాయకపోడులు పూజారులుగా వ్యవహరిస్తున్నారు. భక్తులు తొలుత గట్టమ్మ తల్లినే దర్శించుకుంటారు. సమ్మక్కకు ఆడపడుచుగా గట్టమ్మ అని మేం నమ్ముతాం. ఈనెల 9న బోనాలు నిర్వహిస్తాం. ఎదురుపిల్ల పండుగగా జరుపుకుంటాం.
-సురేందర్, గట్టమ్మ దేవాలయం పూజారి
పోటెత్తిన భక్తులు..
Rush at Medaram Jatara: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవం కన్నులపండువగా కొనసాగుతోంది. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తజనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. భక్తులంతా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా మంది తాము మొక్కుకున్నట్లుగా నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారు.
దుకాణాలు బంద్..
Medaram Jatara Rush: కరోనా మూడో ముప్పు, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల మేడారంలో దుకాణాలను మూసివేశారు. బెల్లం, మంచినీళ్లు, పసుపు, కుంకుమ వంటి అత్యవసరమైన వస్తువులు మాత్రమే విక్రయిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులంతా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులంతా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
MEDARAM Special Busses : ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా ఆర్టీసీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈనెల 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం జాతర సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నాలుగు వేలకు పైగా బస్సులు నడపనున్నారు. మరోవైపు గద్దెల సమీపంలో... జంపన్న వాగు వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: