తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి(yadadri) శ్రీలక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కొండపై బాలాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. తెల్లవారుజామున సుప్రభాతం నిర్వహించి స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు ఆర్జిత పూజలు జరిపించారు. నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగించారు. ఉత్సవ మూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు జరిపించారు. శ్రీలక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమం, నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
లడ్డు ప్రసాదాల కౌంటర్, ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపిస్తుంది. రద్దీ అధికంగా ఉండటంతో ధర్మదర్శనానికి దాదాపు గంటన్నర పైగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అరగంట సమయం పడుతుంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతి పోలీసులు నిరాకరిస్తున్నారు.
శరవేగంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా తుది మెరుగుల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు యాడా అధికారులు శ్రమిస్తున్నారు. పుష్కరిణి ప్రాంగణంలో ఆంజనేయస్వామి ఆలయ సమీపాన చదును చేస్తూ గోడ నిర్మిస్తున్నారు. గోడ వల్ల ఆలయం, బస్ బేకు వెళ్లే మార్గం సుగుమం కానుంది. ప్రధానాలయానికి సామాన్య భక్తులు కాలినడకన వెళ్లేందుకు నిర్మిస్తున్న మెట్లదారిని మెరుగుపరిచే క్రమంలో అండర్‌పాస్‌పై స్లాబ్ పనులు చేపట్టారు.
ఆలయ కైంకర్యాల నిర్వహణకు విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ వేగవంతం చేశారు. ఇక్కడ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఆలయ అధికారులు దృష్టిసారించారు. అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్న ఫ్లోరింగ్ పనులు చివరిదశకు చేరాయి. శివుడి రథశాలను శైవాగమ ప్రకారం ప్రత్యేక హంగులతో ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మాతృభాషకు.. మాస్టారు వందనం