రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నియామకానికి సంబంధించి 2019 జూన్ 18న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 131 , ఏపీ సివిల్ సర్వీసెస్ ( ప్రవర్తన ) నిబంధనలను తమ ముందు ఉంచాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. వ్యాజ్యంపై విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించనందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. సజ్జల రామకృష్ణారెడ్డికి క్యాబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం సలహాదారుగా నియమించిందన్నారు . ప్రభుత్వం నుంచి జీతం, ఇతర ప్రయోజనాలు పొందుతున్నారన్నారు . ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తిస్థాయన్నారు . సలహాదారు పాత్రకే పరిమితం కాకుండా వైకాపా తరఫున రాజకీయ పాత్ర పోషిస్తూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు . ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ .. నియామక జీవో , ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలను వాజ్యంతో జతచేయలేదని ఆక్షేపించింది. ఆ వివరాల్ని కోర్టు ముందు ఉంచాలంది. అందుకు న్యాయవాది అంగీకరించడంతో అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Ysr asara: నేడు 'వైఎస్సార్ ఆసరా' పథకం రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల