మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్ట్‌తో పాటు ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సంబంధించిన పురోగతిని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించిన నేపథ్యంలో డీఎస్‌పీ సీహెచ్ రవికుమార్‌ను దర్యాప్తు బాధ్యతల నుంచి మార్చాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈనెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రిని ఆదేశించింది. దర్యాప్తు కొనసాగించుకోవచ్చని సీఐడీకి స్పష్టం చేసింది. వ్యాజ్యంపై విచారణను మే 7కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు గురువారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ప్రచారం చేశారనే ఆరోపణతో వైకాపా లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్.నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దేవినేని ఉమా మహేశ్వరరావుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దానిని కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రాథమిక విచారణ జరపకుండా మూడో వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేరుగా కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి ప్రదర్శించిన వీడియోలో గొంతు ముఖ్యమంత్రిదే అని ఫిర్యాదుదారుడే పేర్కొన్నారు. తిరుపతిలో వీడియో ప్రదర్శన జరిగితే.. మంగళగిరిలో కేసు నమోదు చేశారు. కర్నూలు సీఐడీ అధికారి దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా పిటిషనర్‌ను వేధించడం కోసమే. నోటీసు ఇచ్చి.. తగిన సమయం ఇవ్వకుండా కర్నూలులో హాజరుకమ్మంటున్నారు. పిటిషనర్‌పై వివిధ సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్ 120బి కింద నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు’ అని కోర్టుకు విన్నవించారు.
120బి ఎలా నమోదు చేస్తారు: న్యాయమూర్తి
నిందితుడు ఒక్కడే అయినప్పుడు ఐపీసీ 120బి సెక్షన్ ఏవిధంగా నమోదు చేస్తారని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. సాధారణంగా ఘటన జరిగిన ప్రాంతంలో కేసు నమోదు చేస్తారని, తిరుపతిలో వీడియో ప్రదర్శన నిర్వహిస్తే.. మంగళగిరి సీఐడీ కేసు నమోదు చేయడం, కర్నూలు సీఐడీ అధికారి దర్యాప్తు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
మంగళగిరి నుంచి దర్యాప్తునకు అభ్యంతరం లేదు: ఏజీ
సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి తిరుపతి వస్తుంది. ఈనేపథ్యంలో అక్కడి డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. 120బి కింద కేసు నమోదు చేశారేకాని లోతైన దర్యాప్తు జరిగితే ఇతరులతో కుట్రకు పాల్పడ్డారా లేదా అనే విషయం తేలుతుంది. 41ఏ నోటీసులు జారీచేసినా పిటిషనర్ దర్యాప్తునకు సహరించడం లేదు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదు’ అని తెలిపారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావడానికి ఎప్పుడు వీలుపడుతుందో కనుక్కోవాలని సీనియర్ న్యాయవాదిని కోరారు. ఈనెల 29న హాజరు అయ్యేందుకు వీలుంటుందని దమ్మాలపాటి శ్రీనివాస్ బదులిచ్చారు. దీంతో ఈనెల 29న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పిటిషనర్‌ను ఆదేశించారు.
ఇదీచదవండి: సీఐడీ విచారణకు హాజరుకాని దేవినేని ఉమా.. ఇంటికి అధికారులు