ఫైబర్‌నెట్ అవకతవకల్లో తనపై వస్తున్న విమర్శలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఏపీ ఫైబర్ నెట్ మాజీ సలహాదారు హరికృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయంగా పని చేసే వారిపై ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. ప్రతి ఇంటికి టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఏపీ ఫైబర్ నెట్ అన్న ఆయన...కేవలం 149 రూపాయలకే 10లక్షల ఇళ్లకు నాణ్యమైన సేవలు అందించామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి సారి ఐపీటీవీ సెట్‌టాప్ బాక్సుల వాడకం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగిందని...ఇప్పుడు చైనా, బ్రెజిల్ ఈ టెక్నాలజీనే వాడుతున్నారన్నారు.
ఈ ప్రాజెక్టు మౌళిక వసతుల కోసం ఇప్పటి వరకూ రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని.., 2వేల కోట్ల స్కామ్ జరిగిందనటం సరికాదన్నారు. ప్రాజెక్టులో భాగంగా 10లక్షల బాక్సుల కోసం టెండర్ వేయగా... 7 కంపెనీలు వచ్చాయన్నారు. అందులో దాసన్ కంపెనీని ఎల్1 గా ఎంపిక చేశామని హరికృష్ణప్రసాద్ తెలిపారు. ఇది ఒక ప్రభుత్వ సంస్థ అని...ఐఏఎస్ అధికారులు ఇందులో పని చేస్తున్నారని వివరించారు. ఈ ప్రాజెక్టు ఐటీ శాఖ కింద ఉన్నది కాదని.. ఇంధన మరియు మౌళిక సదుపాయాల మంత్రిత్వ శాఖ కింద ఉందని పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ నెట్ మొదలైన నాటికి నారా లోకేశ్ ఐటీ మంత్రి కాలేదని వివరించారు.
ఇదీచదవండి