GROUP 1: గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో పారదర్శకత తేలాలంటే న్యాయ విచారణ జరగాల్సిందేనని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో గ్రూప్-1 అభ్యర్థులు చంద్రబాబుని కలిశారు. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని అభ్యర్థులు ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్‌లో 62శాతం వ్యత్యాసం ఉండటమే అనుమానాలకు బలమిస్తోందని తెలిపారు. మాన్యువల్ మూల్యాంకనంలో 80శాతం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని గ్రూప్-1 అభ్యర్థులు మండిపడ్డారు.
తొలుత నిర్వహించిన డిజిటల్ మూల్యాకనంలో 326 మందిని అర్హులుగా ప్రకటించడంతో పాటు.. పారదర్శకంగా చేశామని హైకోర్టులో ఏపీపీఎస్సీ అఫిడవిట్ దాఖలు చేసింది. తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాంకనంలో 202 మంది డిజిటల్లో అర్హత పొందిన వారిని తొలగించారు. ఇది కూడా పారదర్శకంగా జరిగిందని ఏపీపీఎస్సీ చెప్తోందని అభ్యర్థులు అంటున్నారు. ఇంటర్వ్యూలు హడావుడిగా నిర్వహించడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. కోర్టుకు సెలవులు ఉన్న సమయంలో హడావుడి ఇంటర్వ్యూల నిర్వహణతో చాలామంది అభ్యర్థులు నష్టపోతారని వారు పేర్కొన్నారు. చంద్రబాబు తమ పోరాటానికి నైతిక మద్దతు ఇవ్వటంతో పాటు న్యాయపరంగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని గ్రూప్-1 అభ్యర్థులు వెల్లడించారు.