గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు మరోసారి ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్కు వినతి పత్రం అందజేశారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విన్నవించారు. ప్రభుత్వం ప్రకటించిన ఈబీసీ, కాపు రిజ్వర్వేషన్లను ఈ నోటిఫికేషన్లలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి సైతం గ్రూప్ 1 అభ్యర్థులు ఏపీపీఎస్సీ కార్యాలయానికి తరలివచ్చారు. పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ ఆందోళన చేపట్టేందుకు నిరుద్యోగ జేఏసీతో కలిసి వచ్చారు.
సిలబస్ కఠినతరంగా ఉండడం వల్ల తమకు మరింత సమయం కావాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యే వాళ్లకి సులువుగా ఉన్నా.... గ్రూప్1 కోసమే ప్రయత్నిస్తున్న వారికి ఇబ్బందికరంగా ఉందనే భావనను ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్కు వివరించారు. గ్రామీణ అభ్యర్థులకు ప్రస్తుతం ఇచ్చిన సమయం ఏ మాత్రం సరిపోదని వాపోయారు.
గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు పరీక్ష వాయిదా కోసం కార్యాలయానికి తరలిరావటంతో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కమిషన్లో చర్చించి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.