న్యాయవృత్తి టీ-20 అంత సులభం కాదని..టెస్టు క్రికెట్‌లా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే ఓపిక ఉండాలని హైకోర్టు సీజే ఏకే గోస్వామి అన్నారు. బదిలీపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు వెళ్తున్న ఆయనకు.. సహచర న్యాయమూర్తులు, బార్‌కౌన్సిల్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. సమాజంలో వివక్షకు గురవుతున్న వారికి.. హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని.. ఇందుకు యువ న్యాయవాదులు చొరవ తీసుకోవాలని సీజే సూచించారు.
అందరూ టీ-20, ఐపీఎల్ క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే అవి చాలా ఉత్కంఠగా సాగుతాయి. అయితే.. న్యాయవ్యవస్థ టీట్వంటీ, వన్డే క్రికెట్ లాంటిది కాదు. టెస్టు క్రీడాకారుడికి ఉండే ఓపిక, సహనం, నేర్పు.. న్యాయవ్యవస్థకు అవసరం. అప్పుడే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలరు. సమాజంలో వివక్షకు గురవుతున్న చాలా మందికి వాళ్ల హక్కుల గురించి కూడా తెలియని పరిస్థితి. హక్కుల ఆవశ్యకతపై అవగాహన లేకపోవడం, సమస్యను చెప్పలేకపోవడం కంటే పెద్దనేరం మరోటి లేదు. అట్టడుగు వర్గాలు, వివక్షకు గురవుతున్న వారికి హక్కుల గురించి అవగాహన కల్పించడం యువన్యాయవాదులు ప్రధాన పాత్ర పోషించాలి. బార్‌కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదుల సహకారంతో ఈ వ్యవస్థను(హైకోర్టు) ఉన్నతస్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నా. - జస్టిస్ ఏ.కే.గోస్వామి
అంతకు ముందు హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ప్రమాణం చేశారు. జస్టిస్ అసనుద్దీన్‌తో సీజే జస్టిస్ ఏ.కే.గోస్వామి ప్రమాణం చేయించారు.
నూతన సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా
హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. 1964 ఆగష్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘసీదాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయ్‌గఢ్ కోర్టుతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. ఆ రాష్ట్ర బార్‌కౌన్సిల్ ఛైర్మన్‌నూ..హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగష్టు 31 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఏజీగా పదోన్నతి పొందారు. 2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నారు.
ఇదీ చదవండి: high court cj : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర..