Freeze Pensions: రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 95 వేలమంది చిరుద్యోగులు పొరుగు సేవల కింద పనిచేస్తున్నారు. వీరికి ఆప్కాస్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. వీరిలో చాలామంది కుటుంబ సభ్యులు సామాజిక భద్రత పింఛన్లు తీసుకుంటున్నారు. పదేళ్ల నుంచి తీసుకుంటున్నవారూ ఉన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. పింఛను నిబంధనల్ని సవరిస్తూ ఆరు దశల తనిఖీ ప్రక్రియ తెచ్చింది. అందులోగ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారి నెల ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారి ఆదాయ పరిమితి రూ.12 వేలుగా నిర్ణయించింది. ఇంతకుమించి ఉంటే పింఛన్లలో కోత పెడుతోంది.
గతంలో ఎవరి పింఛనైనా తొలగిస్తే.. అందుకు కారణాన్ని తెలుపుతూ ముందుగానే నోటీసు జారీ చేసేవారు. ఈసారి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నిలిపేశారు. దీంతో పొరుగు సేవల సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొంతమంది 1902 నంబరుకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులనే కారణంతో...పింఛను నిలిపేసినట్లు కాల్‌సెంటర్ సిబ్బంది సమాధానం చెబుతున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఇలా వారి కుటుంబాల్లోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు నిలిచిపోయాయి. అయితే ఎంతమందికి నిలిపివేశారనే విషయం బయటకు తెలియకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారు.
పొరుగు సేవల ఉద్యోగుల్లో చాలామంది తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి కాకుండా వేర్వేరుగా ఉంటున్నా.. ప్రభుత్వ దస్త్రాల్లో ఒకే కుటుంబంగా నమోదై ఉన్నారు. బియ్యం కార్డుల్లో, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో మార్పు చేసుకోకపోవడం వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారిని.. అధికారులు ఒకటిగానే పరిగణిస్తూ పథకాల్లో కోత వేస్తున్నారు. పొరగు సేవల ఉద్యోగులకు ఇచ్చేదే రూ.15 వేల నుంచి రూ.18 వేల రూపాయలలేనని, వాటితో కుటుంబం గడవటమే కష్టంగా ఉంటే.. ఇప్పుడు సంక్షేమ పథకాలూ దూరం చేయడం సరికాదంటున్నారు. తమ వల్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతన్నారు. ఇప్పటికే బోధనా రుసుములు నిలిచిపోగా.. తల్లిదండ్రులకు మందులు, ఇతర అవసరాలకు ఆధారంగా ఉన్న పింఛను సాయమూ ఆగిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. తమ జీతాలను సీఎఫ్ఎంఎస్కు.. లింకు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తించవంటూ కోతలు వేయడం తగదని పొరుగు సేవల ఉద్యోగులు వాపోతున్నారు.
ఇవీ చూడండి