రాష్ట్రంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల టికెట్లపై అదనంగా రూ.75 మేర వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజులపాటు పెంచిన ధరలు వర్తిస్తాయని హోమ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పొలీస్ కమిషనర్లు, జేసీలకు ఆదేశాలు జారీ చేసింది.
రెండు రోజుల క్రితమే జగన్‌తో సమావేశం
ఈనెల 25న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా విడుదల కానుంది. సందర్భంగా టికెట్ల రేట్ల విషయమై రెండు రోజుల క్రితం చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య ముఖ్యమంత్రి జగన్‌ను.. ఆయన నివాసంలో కలిశారు. ఈ క్రమంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఆ నిబంధన ఆర్ఆర్ఆర్కు వర్తించదు: పేర్నినాని
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ధరల పెంచుకునేందుకు 20 శాతం షూటింగ్ రాష్ట్రంలో చేసి ఉండాలన్న నిబంధన విధించింది. అయితే... 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం కొత్త జీవో విడుదలకు ముందే చిత్రీకరణ జరిగినందున.. 20 శాతం షూటింగ్ రాష్ట్రంలో చేసి ఉండాలన్న నిబంధన వర్తించదని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రమోషన్స్‌లో నయా ట్రెండ్.. హోస్ట్‌గా మారుతున్న డైరెక్టర్లు!