రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ విధానం అమలు ప్రారంభమై.. ఖాళీలపై స్పష్టత వచ్చాక టీచర్ల భర్తీ చేపడతామని వెల్లడించారు. ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా... ఒక్క ఉపాధ్యాయుడి ఉద్యోగం పోకుండా నూతన విద్యావిధానాన్ని సీఎం జగన్ అమలు చేస్తారని హామీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల 8 వేల బడుల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారన్నారు. నూతన విద్యావిధానంలో ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. టీచర్ల నిష్పత్తి, సర్దుబాట్లు పూర్తైన తర్వాత భర్తీలు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రతిపక్షాలకు సూచించారు.
విద్యారంగాన్ని వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకెళ్తుందని సజ్జల తెలిపారు. రెండేళ్లలో దేశంలో ఎక్కడా లేని రీతిలో 1 లక్ష 83 వేల 480 రెగ్యులర్ ఉద్యోగాలు సీఎం జగన్ భర్తీ చేశారన్నారు. జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య తగ్గిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న ఆయన... ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య పెరగవచ్చన్నారు.
రాష్ట్రం వెనక్కి వెళ్లిందని తీర్మానం చేసిన భాజపా నేతలు..ఎక్కడికి వెళ్లిందో చెప్పాలన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడుస్తోందని సజ్జల వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలిగినా..దాన్ని జగన్ ఎదుర్కొంటున్నారన్నారు. కొవిడ్‌పై చంద్రబాబు చేయబోయే దీక్షకు అర్థం లేదన్న సజ్జల... కొవిడ్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి
chandrababu: అమరావతిని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలనే కలను సాకారం చేశారు: చంద్రబాబు