పార్టీలో తన మాటకు తగిన గౌరవం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్న తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాంతించారు. రాజకీయాల నుంచి వైదొలగాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆయన గురువారం సాయంత్రం తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు వారి సమావేశం జరిగింది.
తాజా పరిణామాలపై ఆయనతో చంద్రబాబు చర్చించారని, పార్టీలో ఆయన గౌరవానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారని పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీ అనంతరం బుచ్చయ్య చౌదరి విలేకరులతో మాట్లాడారు.' పార్టీ బాగుండాలనే తప్ప...నా స్వార్థం కోసమో, ఎవర్నో బెదిరించాలని కాదు. చంద్రబాబుకు నా అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పా. లక్షల మంది కార్యకర్తల త్యాగాలు వృథా కాకుడదని రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా. నేను ఉన్నంత కాలం పార్టీకి సేవ చేస్తా' అని చెప్పారు.
ఇదీ చదవండి