Second day Bala Tripura Sundari Devi: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా తరలివస్తున్నారు. సమస్త దేవీ మంత్రాల్లో శ్రీబాలా మంత్రం గొప్పది.. మహిమాన్వితమైందిగా భక్తుల విశ్వాసం. అందుకే శ్రీవిద్యోపాసకులకి తొలుత బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు.
మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే తొలి దేవత బాలాత్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే అమ్మ కరుణ పొందగలమన్నది పురాణ ప్రతీతి. ఒక చేత జమపాల, మరోచేత పుస్తకాన్ని చేతపట్టుకుని స్వర్ణకమలంపై కొలువుదీరిన లోకపావనిని దర్శించుకోవడం వల్ల మనస్సు, బుద్ధి, అహకారం ఆధీనంలో ఉంటాయని పండితులు పేర్కొంటున్నారు. నిత్య సంతోషం కలుగుతుందని వెల్లడించారు. రెండు నుంచి పదేళ్ల వయసులోపు బాలికలను బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపంగా అర్చించి, సకల సుమంగళ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు అందించి ఆ తల్లి అనుగ్రహం పొందుతుంటారు.
స్వచ్ఛందంగా సేవలు: ప్రభుత్వ శాఖల మధ్య తొలిరోజు తలెత్తిన సమన్వయలోపంతో ముందు కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అనంతరం సదుపాయాల కల్పనలో అలసత్వాన్ని అధిగమిస్తూ అధికార యంత్రాంగం పగడ్భందీ చర్యలు చేపట్టింది. వృద్ధులు, దివ్యాంగులకు అమ్మవారి దర్శన కల్పించేందుకు వీలుగా వీల్‌చైర్లు, సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వివిధ కళాశాలల విద్యార్ధులతోపాటుగా.. రెడ్‌క్రాస్ సిబ్బంది స్వచ్ఛందంగా సేవలను అందిస్తున్నారు. సర్వదర్శనంతోపాటు వంద, మూడు వందల రూపాయల వరుసల్లో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. భక్తులు ఎక్కువసేపు వరుసల్లో నిరీక్షించకుండా త్వరగా దర్శనం పూర్తయ్యేలా చూస్తున్నారు.
ఆకస్మికంగా వీఐపీ టిక్కెట్లను తనిఖీ చేసిన కలెక్టర్: వీఐపీలకు కేటాయిస్తున్న ఐదు వందల రూపాయల టిక్కెట్ల జారీని క్రమబద్ధీకరించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతోపాటు.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఎస్.డిల్లీరావు వీఐపీ టిక్కెట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఏ రోజు ఎంతమంది దర్శనానికి వస్తున్నది శాస్త్రీయంగా లెక్కించేందుకు ఫుట్‌స్కానర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తుల ఇబ్బందులు, ఏర్పాట్ల లోటుపాట్లపై వారి నుంచే వివరాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. టిక్కెట్లు తీసుకోకుండా వీఐపీ వరుసల్లో నుంచి అమ్మవారి దర్శనానికి వస్తోన్న వారిని నియంత్రించేందుకు ఆలయం మొత్తం కలియతిరిగిన జిల్లా కలెక్టరు.. అనధికారికంగా వరుసల్లోకి వస్తోన్న ప్రదేశాలకు ఇంజనీరింగ్ సిబ్బందితో తాళాలు వేయించారు. భక్తుల రద్దీ పెరుగుతున్నందున సామాన్యులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మరింత మెరుగైన పద్ధతులు అనుసరిస్తున్నట్లు కలెక్టరు తెలిపారు.
ఇవీ చదవండి: