జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో 30 సర్కిళ్లు, 6 జోన్లున్నాయి. కోటి మందికిపైగా జనాభా ఉన్నారు. అక్రమ నిర్మాణాలు, వివాదాస్పద భూముల్లోని గుర్తింపులేని ఇళ్లను, అధికారిక నిర్మాణాలను కలిపితే 25 లక్షల భవనాలుంటాయి. రోడ్లు 9 వేల కిలోమీటర్లకుపైగా ఉన్నాయి. నగర శివారులో మరింత అభివృద్ధి జరుగుతోంది. జనాభా, నిర్మాణాల పెరుగుదల వేగంగా జరుగుతోంది. ఆమేరకు రాష్ట్రప్రభుత్వం ఇటీవల నగరం చుట్టూ కొత్త నగరపాలక సంస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ చుట్టూ 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవేమీ జీహెచ్‌ఎంసీకి పట్టట్లేదు. కమిషనర్ కార్యాలయం నుంచి అదనపు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారుల వరకు మెజార్టీ యంత్రాంగం విధి నిర్వహణను తేలిగ్గా తీసుకుంటోంది.
పని లేనట్లుగా..
* కమిషనర్‌తో కలిపి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులున్నారు. వారిలో ఇద్దరు మధ్యాహ్నమయ్యాక కార్యాలయానికి వస్తారు. విభాగాలపై ఎలాంటి సమీక్షల్లేవు. క్షేత్రస్థాయి తనిఖీల్లేవు.
* అదనపు కమిషనర్ల హోదాలో 9 మంది పారిశుద్ధ్యం, ఆరోగ్యం, రెవెన్యూ, రవాణా, ఐటీ, న్యాయ, యూసీడీ, ఎలక్ట్రికల్, క్రీడలు, ఎస్టేట్స్, ఎన్నికలు, ఫైనాన్స్, పరిపాలన, ఇతరత్రా విభాగాలకు నేతృత్వం వహిస్తారు. ఏడాదిన్నరగా సగం విభాగాల్లో నూతన ఆవిష్కరణలు/పురోగతి లేదన్న విమర్శలున్నాయి.
* రెండు వారాలకుపైగా ఓ ఏసీ కార్యాలయానికే రావట్లేదు. సెలవూ పెట్టలేదు.
* పౌర సేవలు గందరగోళంగా మారాయి. ఆహార కల్తీతో ప్రజారోగ్యం పడకేస్తోంది. వ్యర్థాల అద్దె వాహనాల టెండర్లలో పెరిగింది.
* నిధులను రాబట్టుకోవడంలో, అభివృద్ధి పనులను కొనసాగించడంలో ఆర్థిక విభాగం తడబడుతోంది. వీధి వ్యాపారులకు కేంద్ర సర్కారు ఇచ్చే రూ.10 వేల రుణ సాయ పథకం లబ్ధిదారులకు చేరువ కాలేదు. నిరాశ్రయులను ఆదుకునే కార్యక్రమాలు పూర్తిగా అటకెక్కాయి. చలిలో నిరాశ్రయులు కొట్టుమిట్టాడుతుంటే.. వారి కోసం కొనుగోలు చేసిన దుప్పట్లను దారి మళ్లించారు.
* కొవిడ్ వ్యాప్తితో ప్రజావాణిని ఆపేసిన అధికారులు.. అనంతరం దృశ్య మాద్యమం ద్వారా వినాలని నిర్ణయించారు. అది మూడు వారాలకే నిలిచిపోయింది. రోజూ 100 నుంచి 200 మంది ఫిర్యాదుదారులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి, కమిషనర్, సంబంధిత అధికారులను కలవలేక వెనుదిరుగుతున్నారు. ప్రజావాణితో తమకు కొవిడ్ వ్యాపిస్తుందని అనుకుంటే పారదర్శక తెర అవతల కూర్చుని తమ సమస్యలను ఆలకించాలని పౌరులు కోరుతున్నారు.పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్న బయోమెట్రిక్ హాజరు నిలిచిపోయింది. అదే అదనుగా కార్యాలయం అధికారులు, సిబ్బంది పని వేళలు పాటించట్లేదు. సర్కిల్, జోనల్ కార్యాలయాల్లోనూ ఇదే తరహా సమస్యలు ఎదురవుతున్నాయి.
- ఇదీ చూడండి : 'బాధను దిగమింగుకుని... బాధ్యతతో అదరగొట్టాడు'