కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క కరోనా బాధితుల అవస్థలు వర్ణనాతీతం. కరోనా మలి దశ తీవ్రత మరింత పెరగటంతో.. కొవిడ్ కేర్ కేంద్రం ఏర్పాటు చేయాలని మాకినేని బసవపుననయ్య విజ్ఞానకేంద్రం ట్రస్ట్ సభ్యులు నిర్ణయించారు. ఏప్రిల్ 16న విజయవాడలోని బాలోత్సవ భవనంలో కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
మొదట 35 పడకలతో ప్రారంభమైన ఈ కొవిడ్ కేర్ కేంద్రంలో ఇప్పుడు 50 పడకలు ఉన్నాయి. కరోనా బాధితులు పెరగడంతో... వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంలో మరో 100 పడకలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. దాదాపు వెయ్యి మందికి పైగా చికిత్స అందిస్తున్నారు. కరోనా రోగుల మానసిక ఉల్లాసం కోసం యోగా చేయిస్తున్నారు.
ఈ కొవిడ్ కేర్ కేంద్రంలో బాధితులకు ఆరుగురు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆన్ లైన్ లోనూ నిరంతరం వైద్యలు అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఆక్సిజన్ పడకలు లేనందున.. ఆక్సిజన్ స్థాయి నిలకడగా ఉన్న కరోనా రోగులను మాత్రమే కేంద్రంలో చేర్చుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అత్యవసరం కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఎన్జీవోలు, ట్రస్ట్‌లు నిర్వహిస్తున్న కొవిడ్ కేంద్రాలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని ట్రస్ట్ సభ్యులు కోరుతున్నారు. దాతలు ముందుకు వస్తే మరింత మంది కరోనా రోగులకు వైద్య చికిత్స అందించగలమని చెబుతున్నారు.
ఇదీ చదవండి: