ప్రాథమిక హక్కుల పరిరక్షణకు గొంతెత్తి నిరంకుశ పోకడలను అడ్డుకున్నప్పుడే రాజ్యాంగ దినోత్సవానికి ఔన్నత్యం చేకూరుతుందని తెదేపా అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కులు, సౌభ్రాతృత్వం, లౌకిక భావాలను కాపాడుకోవాలన్నారు. రాజ్యాంగ పెద్దల ఆశయాలు, ఆకాంక్షలను తుంగలో తొక్కే పెడ ధోరణులను ప్రతిఒక్కరూ అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేసి అద్భుత సమాజాన్ని పెద్దలు ఇచ్చారని వివరించారు. శాసన నిర్మాణం, పరిపాలన, న్యాయ, మీడియా వ్యవస్థలే నాలుగు మూల స్తంభాలుగా భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికే దిక్సూచిగా చేశాయని తెలిపారు. వీటిని నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం అందరి బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు.
దుశ్చర్యలకు రాష్ట్రం వేదిక కావడం బాధాకరం
ప్రశ్నించే గొంతును నులిమేయడం, మీడియాపై ఆంక్షలు-దాడులు, ప్రాథమిక హక్కులను కాలరాయడం, సౌభ్రాతృత్వానికే కళంకం తేవడం, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు వంటి దుశ్చర్యలకు మన రాష్ట్రం వేదిక కావడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలోని వాళ్లే దానికి తూట్లు పొడవడం క్షమార్హం కాదని, ఎంతటి వారైనా వ్యవస్థకు బద్దులై ఉండాల్సిందేననని స్పష్టంచేశారు. ఎస్సీలపైనే అట్రాసిటి కేసుల నమోదు, రైతులకు బేడీలు వేయడం, పాలకుల వేధింపులు తట్టుకోలేక సామూహిక ఆత్మహత్యలు, మహిళలపై సామూహిక అత్యాచారాలు, ప్రతిపక్షాలపై అణిచివేత చర్యలు పేట్రేగడం గర్హనీయమన్నారు.
ఇదీ చదవండి: