VMC Commissioner: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న.. విజయవాడ నగరపాలిక కమిషనర్ స్పప్నిల్ దినకర్‌ను సాగనంపేందుకు అధికార పార్టీ నేతలు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. తమ మాటను ఖాతరు చేయడం లేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. స్వప్నిల్ దినకర్ వీఎంసీ కమిషనర్‌గా వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. నిబంధనల ప్రకారమే వెళ్తూ ముక్కుసూటిగా వ్యహరిస్తున్నారు. దీంతో ఎక్కడా తమ పప్పులు ఉడకడం లేదని నేతలు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆయన పట్ల గుర్రుగా ఉన్నారు. కమిషనర్ బదిలీకి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పలువురు ఉన్నతాధికారులు, మంత్రులను కలసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ప్రజాప్రతినిధులు అధికారులకు సిఫార్సులు చేయడం సాధారణమే. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కమిషనర్ పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులకు సంబంధించి బిల్లును త్వరగా మంజూరు చేయాలని ఓ నేత ఫోన్ చేశారు. తాను క్షేత్రస్థాయికి వెళ్లి, నాణ్యత పరిశీలించిన తర్వాతే సంతకం చేస్తానని బదులిచ్చినట్లు తెలిసింది. తాను చెప్పినా వినలేదని ఆ ప్రజాప్రతినిధి కినుకు వహించారు. ఇటీవల కమిషనర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి లేకపోవడంతో షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆ ఉద్యోగి ఓ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కమిషనర్‌కు ఆ నేత ఫోన్ చేసి చెప్పినా వినలేదు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశారు..
పట్టణ ప్రణాళిక విభాగంలో పలువురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల కోసం అధికార పార్టీ నేతలు, కొందరు కార్పొరేటర్లు విశ్వప్రయత్నం చేశారు. దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. వారు కోరిన వారిని బదిలీ చేసేందుకు అంగీకరించలేదు. క్రమశిక్షణా చర్యలకు గురైన ఉద్యోగులు ఎక్కువ మంది నేతల వద్దకు వెళ్తున్నారు. వాటిని రద్దు చేసేందుకు నాయకులు చేస్తున్న విజ్ఞప్తులను కూడా స్వప్నిల్ దినకర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నగరంలోని అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఆయన గట్టిగా వ్యవహరిస్తున్నారు. వీరు సిఫార్సు చేసిన వాటిని సైతం కూల్చేస్తుండడంతో నేతలు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో కార్పొరేటర్లు ఎప్పుడైనా నగరపాలక కమిషనర్‌ను కలిసేవారు. స్వప్నిల్ దినకర్ వచ్చిన తర్వాత.. వారికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. సోమ, బుధ, శుక్రవారల్లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కార్యాలయంలో కలిసేందుకు అవకాశం ఉంది. ఫ్లెక్సీల విషయంలోనూ కమిషనర్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుండడం అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. నగరం మొత్తంగా విచ్చలవిడిగా అనుమతి లేకుండా పెట్టే ఫ్లెక్సీలను ఆయన తొలగిస్తున్నారు. కేవలం ఒక్క రోజే ఉంచి తీయించేస్తున్నారు. ఇలా అన్నీ తోడై నేతలకు, కమిషనర్‌కు మధ్య అంతరం రావడానికి కారణమైంది..
తమ మాట వినని కమిషనర్‌ను ఎలాగైనా ఇక్కడి నుంచి బదిలీ చేయించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై ఇటీవల వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంలో నేతలకు సర్దిచెప్పారు. ఇటీవలే వచ్చిన అధికారిని త్వరగా మార్చడం సమంజసం కాదని సర్దిచెప్పినట్లు తెలిసింది. సీఎం దావోస్ వెళ్లారని, ఆయన వచ్చిన తర్వాత చూద్దామని చెప్పినట్లు సమాచారం. ఇంతటితో ఆగక మంత్రులకు కూడా వివరించారు.
ఇవీ చదవండి :