పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ(38) మృతి చెందారు. ఈ నెల 3న తీవ్రఅనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఏలూరులో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాంజీ భౌతికకాయాన్ని ఇవాళ తెల్లవారుజామున ఏలూరులోని మాగంటి నివాసానికి తీసుకువచ్చారు. రాంజీకి భార్య, కుమారుడు ఉన్నారు. రాంజీ మృతి పట్ల తెదేపా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి.
రాజకీయాల్లో చురుకైన ప్రాత..
రాంజీ తెదేపాలో చురుకైన పాత్ర పోషించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల కాలం వరకు పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా తండ్రి విజయానికి రాంజీ ఎంతగానో కృషి చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి రాంజీ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెదేపా ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఇతర నాయకులు రాంజీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని.. యువ నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. మాగంటి బాబు కుటుంబం ధైర్యంగా ఉండాలని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీచూడండి: