ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ, అఖిల భారత రైతు సంఘాల కో - ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు.. విజయవాడలో అఖిల పక్ష మహిళా సంఘాలు సమావేశం నిర్వహించాయి. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతు తెలపాలని సమావేశంలో తీర్మానించారు. ఈనెల 18న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో.. రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలతో ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఆందోళనలలో పెద్దఎత్తున పాల్గొని వ్యవసాయ చట్టాలు రద్దు కోసం ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు. మహిళలందరూ ఈనెల 13న రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేయాలని కోరారు. రైతు విజయమే మహిళా విజయం అనే నినాదాలతో ముగ్గులు వేయాలన్నారు. జనవరి 16, 17 తేదీలలో కరపత్రాల ద్వారా గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను రూపొందించుకున్నామన్నారు. కేంద్రం మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సుంకర పద్మశ్రీ తెలిపారు. ఈనె 23న రాజ్ భవన్ ముందు తమ గళం వినిపిస్తామన్నారు. ఈనెల 26న ట్రాక్టర్లతో దిల్లీలో రైతుల కవాతుకు సంఘీభావం తెలుపుతామన్నారు.
ఇదీ చదవండి: ఎల్లంపల్లి ఆంజనేయస్వామి ఆలయం తలుపులు ధ్వంసం