స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, జాతీయస్థాయిలో కీలక భూమిక పోషించిన తెలుగు వారిలో భోగరాజు పట్టాభి సీతారామయ్యది ప్రత్యేక స్థానం. మహాత్మాగాంధీ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన పట్టాభి 1906లో మచిలీపట్నం కేంద్రంగా వైద్యవృత్తి చేపట్టారు. గాంధీజీ పిలుపుతో 1916లో వైద్యవృత్తిని వదిలేశారు. దేశానికి స్వాతంత్య్రం సాధించే వరకు మరే వృత్తీ చేపట్టబోనంటూ ప్రతినబూనారు. అదే ధ్యేయంతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 1923లో ఆంధ్రా బ్యాంకును స్థాపించి తెలుగుజాతికి ఎన్నో సేవలు అందించారు. స్వాతంత్ర్యానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి వరించినా సున్నితంగా తిరస్కరించారు. ఆయన జీవిత చరమాంకంలో మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు.
గాంధేయులలో ప్రప్రథముడు...
పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో 1880 నవంబర్ 24న పట్టాభి సీతారామయ్య జన్మించారు. రఘుపతి వేంకటరత్నం నాయుడు లాంటి గురువుల శిక్షణలో పట్టాభి రాటుదేలారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్య్రోద్యమ కాంక్ష కలిగిన పట్టాభికి మద్రాస్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలు, ఆనందమోహన్ బోస్ ఉపన్యాసం ఉత్తేజం కలిగించాయి. 1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు వంటివారితో కలసి అవిశ్రాంతంగా పోరాడారు. హోంరూల్ ఉద్యమం ఉద్ధృతంగా సాగిన కాలంలో అనీబిసెంట్ నాయకత్వంలో పనిచేశారు. అనంతర కాలంలో గాంధీజీ వెంట నడిచి ఆయన అంతరంగాన్ని వడబోసిన గాంధేయులలో ప్రప్రథముడిగా నిలిచారు. గాంధీజీతో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత స్వాతంత్య్రోద్యమంలో జరిగిన ప్రతి ఘట్టంలోనూ పట్టాభి తనవంతు పాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ సభల్లో తలెత్తే వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు. 1922, 23లలో శాసనసభల బహిష్కరణ ప్రతిపాదనను సమర్థించారు. చిత్తరంజన్‌దాస్, విఠల్‌భాయ్ పటేల్ వంటి నాయకులతో వాదించి మెప్పించారు.
'ఫెదర్స్ అండ్ స్టోన్స్' పుస్తకంగా...
1932 శాసనోల్లంఘన ఉద్యమంలో పట్టాభి సీతారామయ్య అరెస్టయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభంలో పట్టాభిని అరెస్టు చేసి మూడేళ్లపాటు అహ్మద్ నగర్ కోటలో బంధించి చిత్రవధ చేశారు. బందీగా ఉన్న సమయంలో దినచర్య గురించి పట్టాభి సంపూర్ణ డైరీ రాశారు. దీన్నే 'ఫెదర్స్ అండ్ స్టోన్స్' పుస్తకంగా ప్రచురించారు. పట్టాభి రచించిన గ్రంథాల్లో కాంగ్రెస్ చరిత్ర అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 16వందల పేజీల కాంగ్రెస్ చరిత్రను కేవలం 2 మాసాల్లో పూర్తిచేశారు. దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో పుస్తకం రాసి సంచలనం సృష్టించారు.
ఎన్నో ఆర్థిక సంస్థల స్థాపన...
తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం భోగరాజు ఎంతగానో కృషి చేశారు. ఆయన చొరవతోనే 1908లో ఆంధ్ర రాష్ట్రోద్యమానికి బందరులో అంకురార్పణ జరిగింది. 1913లో బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతపై పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించారు. భాషా ప్రాతిపదికగా ప్రాంతాలను పునర్విభజించాలన్న వాదాన్ని ఆయన గట్టిగా ముందుకు తెచ్చారు. తెలుగు వాడకాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించారు. ఆంధ్రా బ్యాంకు ద్వారా వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించారు.
ఎన్నో చిరస్మరణీయ సేవలు...
నమ్మిన సిద్ధాంతాల విషయంలో రాజీలేని నాయకుడు. జన్మభూమి, అమ్మభాష అంటే ఎనలేని మమకారం. అభిప్రాయ భేదాలొస్తే పార్టీలో ఎంతటి వారితోనైనా ఢీ అంటే ఢీ అనగల ధీశాలి. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలు అందించిన గొప్పనేతగా ఖ్యాతి గడించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య....1959 డిసెంబర్ 17న తుదిశ్వాస విడిచారు.
ఇవీచదవండి.