రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న పేదవారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు.
పండ్లు పంపిణీ చేసిన సీపీఐ నేతలు
విజయవాడ గాంధీనగర్ సీపీఐ నగర కార్యాలయంలో సోషలిస్టు రాజ్య స్థాపకులు వీఐ.లెనిన్ 150వ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు నక్కా వీరభద్రరావు అధ్యక్షతన సుమారు 200 మంది పేదలకు పండ్లు పంపిణీ చేశారు.
వాటర్ బాటిళ్లు పంపిణీ
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ప్రధాన కూడళ్లలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి స్థానిక ఎస్ఎమ్ఆర్ & సన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లస్సీ, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. వారితో పాటు ఉపాధ్యాయులకు, పారిశుద్ధ్య కార్మికులకు వాటర్ బాటిళ్లను అందించారు.
ప్రతి ఇంటికి హోమియో మందులు పంపిణీ
అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డు వాలంటీర్లతో అనకాపల్లిలోని ప్రతి ఇంటికి హోమియో మందులను అందించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
నిత్యావసర సరకులు పంపిణీ
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని యానాది కాలనీ, కొలనుకొండ రైల్వే గేట్ పరిధిలోని 125 నిరుపేద కుటుంబాలకు 'టెట్రా ప్యాక్ ఇండియా-దళిత బహుజన రిసోర్స్ సెంటర్' సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర ఛైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి చేతుల మీదగా నిత్యావసర వస్తువులను అందించారు.
1400 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా మారేడుబాక సూర్యచంద్ర పేపర్ మిల్ ఎండీ ముత్యాల రామారావు గ్రామస్థులకు చేయూత నిచ్చేందుకు ముందుకొచ్చారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 1400 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు బిర్యానీ పంపిణీ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ సహకారంతో ప్రకాశం జిల్లా అద్దంకిలో బెస్ట్ బిర్యానీ కంపెనీ తరఫున పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు బిర్యానీ పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఆకలికి ఏ పేదవాడు ఉండకూడదనే ఉద్దేశంతో ఆహారం అందించడం జరుగుతుందని నగర పంచాయతీ కమిషనర్ పేర్కొన్నారు.