విదేశాల నుంచి బంగారం ఎగుమతుల పేరిట మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ జువెల్లరీస్ సంస్థపై ఈడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఏకకాలంలో హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ జువెల్లరీస్ కార్యాలయాలు, దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తోంది. 2019లో డీఆర్‌ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ కీలక సమాచారం సేకరించి ఆరు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తోంది. బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయం శ్రీకృష్ణా హౌస్‌తో పాటు అబిడ్స్ తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని శ్రీకృష్ణ జువెల్లరీస్కి చెందిన సెజ్ యూనిట్లో నింబంధనలు అతిక్రమించి బంగారాన్ని ఎగుమతికి బదులు స్థానిక షాపులకు విక్రయించారని... మొత్తం 330 కోట్ల విలువ చేసే 1100 కేజీల బంగారాన్ని దారి మళ్లించారని.. 2019 మేలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆధారాలు సేకరించింది.
ఈ రోజు ఉదయం ఆరు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఏకకాలంలో నగరంలోని అన్ని దుకాణాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెట్లను ఈడీ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. ఉదయం పది గంటలు నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని తేలితే వారిపై కేసు నమోదు చేసి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది.