కృష్ణపట్నం థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటుకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు పట్టుబట్టారు. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. దీంతోపాటు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఐకాస ఇచ్చిన సమ్మె నోటీసుపై బుధవారం అర్ధరాత్రి వరకు చర్చలు సాగుతున్నాయి. సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌తో పాటు డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. ఐకాస తరఫున 15 మందిని మాత్రమే అనుమతించారు. 24 డిమాండ్లతో జనవరి 28న ఉద్యోగుల ఐకాస సమ్మె నోటీసునిచ్చింది. ‘కృష్ణపట్నం ప్లాంటు నష్టాల్లో ఉందంటూ ప్రైవేటుకు అప్పగించడం సరికాదు. నష్టాలకు ఎన్నో కారణాలున్నాయి.
నిర్వహణకు అవసరమైన బొగ్గును అందుబాటులో ఉంచడానికి ఎప్పటికప్పుడు నిధులివ్వాలి. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటే చరవ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఇదే ప్రాంతంలో 2021-22లో ఏపీఈఆర్‌సీ యూనిట్‌కు అనుమతించిన చరవ్యయంకంటే తక్కువకే ఉత్పత్తి చేశాం’ అని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా కొందరు అధికారులు సమాచారమిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సిబ్బందిలో అభద్రతా భావాన్ని కలిగించేలా యాజమాన్యం చర్యలున్నాయని నేతలు ప్రస్తావించారు. ‘జెన్‌కో థర్మల్ యూనిట్లను బ్యాక్‌డౌన్ చేసి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్ల ద్వారా ఆదా చేసినట్లు యాజమాన్యం చెబుతోంది. బహిరంగ మార్కెట్‌లో కొన్న విద్యుత్ యూనిట్ ల్యాండెడ్ ధర ఎంత? అన్ని ఖర్చులు కలిపితే కృష్ణపట్నం, జెన్‌కో యూనిట్ల నుంచి తీసుకునే యూనిట్ విద్యుత్ సగటు వ్యయంకంటే అది ఎక్కువే ఉంటుంది. ఈ వాస్తవాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఉద్యోగ సంఘాలు పట్టుపట్టాయి.
‘ట్రాన్స్‌కో, డిస్కంల సిబ్బందికి ఫిబ్రవరి మొదటి తేదీనే యాజమాన్యాలు జీతాలిచ్చాయి. జెన్‌కో సిబ్బంది జీతాల కోసం నిరసన తెలపాల్సి వచ్చింది. ఇదంతా యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా చేస్తోంది. విద్యుత్ సంస్థల సిబ్బంది మధ్య చీలికకు ప్రయత్నిస్తోంది’ అని నేతలు ప్రస్తావించారు. సిబ్బంది జీతాల చెల్లింపులో భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూస్తామని, మిగిలిన అంశాలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదని మంత్రి బాలినేని పేర్కొన్నారు.
పీఆర్‌సీపై కొత్త సంప్రదాయమేంటి?:‘విద్యుత్ సిబ్బంది జీతాలను త్రైపాక్షిక ఒప్పదం ప్రకారం అంతర్గతంగా ఏర్పాటుచేసిన పీఆర్‌సీ కమిటీ నిర్ణయిస్తుంది. కానీ.. పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయడమేంటి? పదవీ విరమణ ప్రయోజనాలు తగ్గుతాయని, పింఛను మొత్తంపై ప్రభావం పడుతుందని సిబ్బందిలో ఆందోళన నెలకొంది. దీంతో పీఆర్‌సీ కమిషన్ నివేదిక వచ్చేలోగా స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? ఇప్పటికైనా కమిషన్ ఏర్పాటును రద్దు చేసి విద్యుత్ సంస్థల్లో ఉన్న సంప్రదాయం ప్రకారం అంతర్గత పీఆర్‌సీ కమిటీ ఏర్పాటుచేయాలి’ అని నేతలు పేర్కొన్నారు. దీనిపై సీఎంతోచర్చించి 2,3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని సజ్జల హామీనిచ్చారు.
సమస్యలపై ప్రభుత్వంతో చర్చించడానికి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఇన్నాళ్లు అవకాశమివ్వలేదంటూ ఐకాస నేతలు అభ్యంతరం తెలిపారు. ‘గత సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఇప్పటివరకు అమలు చేయలేదు. సిబ్బందిపై నమోదైన కేసులను తొలగిస్తామని హామీనిచ్చి ఇప్పటి వరకు అమలుచేయలేదు’ అని పేర్కొన్నారు. వీటితో పాటు కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు, విద్యుత్ సిబ్బందికి అన్నిరకాల వైద్య సేవలు, ఇతర సౌకర్యాలు కల్పించడాన్ని పరిశీలించాలని కోరారు.
ఇదీ చదవండి: