విద్యుత్ పొదుపులో విజయవాడలోని రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రతిష్టాత్మక ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఐఎస్వో 50001 : 2011 ధృవీకరణ పత్రాన్ని సాధించింది. ఉత్తమ, ప్రత్యేకమైన ప్రమాణాలతో ఎనర్జీ మేనేజ్‌మెంట్ పద్ధతులను అమలు చేసినందుకు తొమ్మిది నెలల కాలానికి(2020 నవంబర్ 21 నుంచి 2021 ఆగస్టు 20) ధృవీకరణ పొందింది.
లోకో షెడ్లో ఉత్తమ శక్తి సామర్థ్య పద్ధతులు అనుసరించడం ద్వారా గతేడాదితో పోలిస్తే నెలకు సుమారు 15 వేల యూనిట్లు ఆదా చేసింది. 2019-20 సంవత్సరంలో ఏప్రిల్19 నుంచి డిసెంబరు 20 వరకు మొత్తం విద్యుత్ వినియోగం 7.29 లక్షల యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం అదే కాలానికి 5.33 లక్షల యూనిట్లు మాత్రమే వినియోగించింది.
సాధారణ ట్యూబ్ లైట్ల స్థానంలో ఎల్ఈడీల వినియోగం, ఎక్కువ సామర్థ్యం కల్గిన ఎలక్ట్రిక్ వస్తువులకు ప్రత్యేక పరికరాలు అమర్చడం, సౌర విద్యుత్ వినియోగం, తదితర చర్యల ద్వారా విద్యుత్‌ను పొదుపు చేశారు. గత రెండేళ్లలో క్వాలిటీ, ఎన్విరాన్మెంట్, వర్క్ ప్లేస్, ఆక్యుపేషనల్, హెల్త్ & సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ సహా ఇప్పటి వరకు మొత్తం 5 ఐఎస్వో ధృవపత్రాలు సాధించి ప్రత్యేకత చాటింది. ఈ ఘనత సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బంది, అధికారులను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ పి.శ్రీనివాస్ అభినందించారు.
ఇదీ చూడండి: