Eenadu Property Show-2022: విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్లో 'ఈనాడు ప్రాపర్టీ షో-2022' ప్రారంభమైంది. ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జె. నివాస్.. జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాపర్టీ షోలో ప్రముఖ బిల్డర్లు, రియల్టర్లు, ఇంటీరియర్ డెకరేటర్లు, బిల్డింగ్ మెటీరియల్ సంస్థలు, రుణ సౌకర్యం కల్పించే బ్యాంకర్లు పాల్గొన్నారు. ఇవాళ, రేపు ఈనాడు ప్రాపర్టీ షో జరగనుంది.
గ్రీన్ బిల్డింగ్ కట్టడాల వైపు రియల్ ఎస్టేట్ ప్రతినిధులు మొగ్గు చూపాలని కలెక్టర్ జె. నివాస్ కోరారు. కొవిడ్ సమయంలో అనేక సెక్టార్లు ప్రభావితమయ్యాయని.. అందులో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఉందన్నారు. ఇలాంటి షోలు నిర్వహించటం వల్ల ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు మరింత వీలుగా ఉంటుందన్నారు. మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని బిల్డర్లను కలెక్టర్ కోరారు.
ప్రజలకు అందుబాటు ధరలతో సొంతింటి కలను నెరవేర్చుతున్నామని బిల్డర్లు తెలిపారు. విజయవాడ నగరంతోపాటు, బందర్ రోడ్డులోనూ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గత కొన్నేళ్లుగా ఈనాడు ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించటం సంతోషకరమన్నారు. ఈ ప్రాపర్టీ షో ద్వారా ప్రజలకు ఇష్టమైన ఇంటిని, వెంచర్లను ఎంచుకునే వీలు ఉంటుందన్నారు. ప్రాపర్టీ కొనుగోళు చేసే వారికి అవసరమైతే బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయిస్తున్నామని తెలిపారు. కొవిడ్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోందన్నారు.
ఇదీ చదవండి
chandra babu kuppam tour: ఎస్సీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం : బాబు