ఎరువులు, పురుగుమందుల వినియోగం అధికం కావడంతో ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యనించారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. శనివారం విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సేవాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ‘సేవా సంగమం 2019’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని, ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవరచుకోవాలని సూచించారు. సమాజంలోని మంచి మార్పు కోసం నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు అందరూ కృషి చేయాలని కోరారు. సేవాభారతి కార్యక్రమాలను ప్రశంసించారు. ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సేవా ప్రముఖ్ పరాగ్ జీ అభ్యంకర్ మాట్లాడుతూ వారసత్వంగా యాచక వృత్తిలో కొనసాగుతున్న వారికి శిక్షణ ఇచ్చి వాయిద్యకారులుగా తీర్చిదిద్దామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారక్ అలె శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ తల్లి తన బిడ్డలకు చేసినట్లుగానే ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ అందించాలని సూచించారు. సేవాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేఎస్‌ఎన్ చారి మాట్లాడుతూ సమాజంలో ఉన్న అభాగ్యులు, అనాథలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాకినాడ శ్రీపీఠం స్థాపకులు స్వామి పరిపూర్ణానంద, సేవాభారతి ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్, సేవా సంగమం గౌరవాధ్యక్షురాలు డాక్టర్ చదలవాడ సుధ, అధ్యక్షుడు తొండెపు హనుమంతరావు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ సేవాభారతి సావనీరును ఆవిష్కరించారు.
ఇదీచదవండి