సాగర్, రామారావు ఒక పల్లెటూరిలో పదో తరగతి వరకు చదువుకున్నారు. మంచి స్నేహితులు. ఆ తర్వాత వేర్వేరు చోట్ల చదువుకున్నారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారిద్దరూ మాట్లాడుకుని దాదాపు 20 ఏళ్లవుతోంది. లాక్‌డౌన్‌తో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో సాగర్ పాత ఫొటోలు తిరగేస్తుంటే... పదో తరగతి పరీక్షలకు ముందు దిగిన గ్రూప్ ఫొటో కనిపించింది. ఆ రోజుల్లో స్నేహితులతో ఆడిన ఆటలు, చేసిన అల్లరి పనులు.. మరుగునపడ్డ జ్ఞాపకాలన్నీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. చాలా ప్రయత్నం తర్వాత రామారావు ఫోన్ నెంబరు దొరికింది. వెంటనే మాట్లాడాడు. బాల్యమిత్రుడి పలకరింపుతో రామారావు ఆనందానికి అవధుల్లేవు. నిమిషాలు దాటి గంటలకొద్దీ కబుర్లు దొర్లిపోయాయి.
* కృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఉద్యోగి. ఉదయం 8 గంటలకే పిల్లల్ని బడిలో దించి, తాను ఉద్యోగానికి వెళ్లిపోయేవాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి పిల్లలు నిద్రపోయేవారు. పిల్లలతో గడిపేందుకు కాస్త తీరిక దొరికేది ఏ ఆదివారం రోజో. కరోనా నేపథ్యంలో కృష్ణ ఇప్పుడు ఇంటి నుంచే ఫోన్లు, ల్యాప్‌టాప్‌తో ఉద్యోగ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. పిల్లలతో అనుబంధం పెరగడానికి ఈ సమయం ఉపయోగపడిందన్నది ఆయన మాట.
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారాలు కుదేలై ఎంతో మంది రోడ్డునపడ్డారు. ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమైంది. ఇంత కష్టకాలంలోనూ కొన్ని సానుకూలాంశాలున్నాయి. ఇది వరకు తల్లిదండ్రులు, పిల్లలు ఒకే ఇంట్లో కలసి ఉంటున్నా.. పట్టుమని పది నిమిషాలు మాట్లాడుకోలేని రోజులెన్నో. ఆ ఉరుకులు, పరుగుల జీవితానికి కరోనా బ్రేకులు వేసింది. ముఖ్యంగా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల జీవన విధానంలో కరోనా చాలా మార్పులే తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో కొందరు ఇప్పటికీ ఇళ్ల నుంచి పనిచేస్తున్నారు. కొందరు ఆఫీసులకు వెళుతున్నా.. పని వేళలు ముగిసిన వెంటనే నేరుగా ఇళ్లకు చేరుతున్నారు. ఇంట్లో ఉన్న సమయాన్ని కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో అనుబంధాల బలోపేతానికి ఉపయోగించుకుంటున్నారు.
ఇంట్లో పెద్దలతో..
వృత్తి, వ్యాపారాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధులను.. కాస్త పలకరించే తీరిక పిల్లలకూ పెద్దలకూ ఎవరికీ ఉండటం లేదు. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పిల్లలు ఇప్పుడు ఆ లోటు తీర్చగలుగతున్నారు. నానమ్మ, తాతయ్యలు పిల్లల్ని కూర్చోబెట్టుకుని కథలు చెప్పటం, జీవితానికి పనికొచ్చే విశేషాలు చెప్పటం లాంటి... పాత దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి.
ఆడుతు, పాడుతు పనిచేస్తుంటే..
ఇంటిపని, వంటపని.. ఆడవారి వ్యవహారం అనేది ఇప్పటికీ చాలామంది భావన. బయటి నుంచి కూరగాయలు, సరకులు తెచ్చుకోవటం వంటి పనులూ చాలా ఇళ్లల్లో మహిళలే చేస్తుంటారు. ఇప్పుడు మగవాళ్లూ ఇంటి పనిలో చెయ్యేస్తున్నారు. బ్రహ్మచారులుగా ఉండగా గరిటె తిప్పిన పురుషులైతే తమకు వచ్చినవి వండి భార్యాబిడ్డలను సంబరపెడుతున్నారు కూడా.
పిల్లల్లో పిల్లల్లా..
* ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీగా ఉండే తల్లిదండ్రులకు.. ఈ కరోనా సమయంలో తమ పిల్లల్ని నిశితంగా గమనించేందుకు, వారి ఆలోచనలు, అభిరుచులు, నైపుణ్యాల్ని అర్ధం చేసుకునే తీరిక చిక్కింది.
* పిల్లలతో కలసి ఆడుకోవడం, కొత్త విషయాలు నేర్పించడం, చదువుల్లో సందేహాలు తీర్చడం ఇదివరకు ఎక్కువగా తల్లులే చూడాల్సి వచ్చేది. కరోనా నేపథ్యంలో ఆ బాధ్యతలు నిర్వహించడం తండ్రులకూ అలవాటైంది.
* తల్లిదండ్రులు తమ చిన్ననాటి సంగతుల్ని.. బంధుమిత్రుల అనుబంధాల గురించి పిల్లలకు చెప్పి ఆనందిస్తున్నారు. దూరంగా ఉన్న బంధువులతో తాము ఫోన్‌లో మాట్లాడటమే కాదు పిల్లలతోనూ మాట కలిపిస్తున్నారు.
*పెళ్లిళ్లు, శుభకార్యాలు ఫొటోలు, వీడియోలు చూస్తూ, పిల్లలకు చూపిస్తూ ఆ మధురక్షణాలను మననం చేసుకుంటున్నారు.
కసరత్తులు చేసేస్తున్నారు
హడావుడి జీవితంలో ఆహార నియమాలు పాటించనివారు, కనీస వ్యాయాయం కూడా చేయనివారు మనలోనే కోకొల్లలు. ఒకపక్క కరోనా భయం, మరోపక్క తీరిక కూడా చిక్కటంతో చాలా మందిలో ఆహారం, వ్యాయామం విషయంలో కొంత క్రమశిక్షణ వచ్చింది. బయటి తిండి తినడం బాగా తగ్గింది. పోషకాహారంపై శ్రద్ధ పెరిగింది. చాలా మంది ఇళ్లలోనే యోగాసనాలు, చిన్నపాటి వ్యాయామాలు చేస్తున్నారు.
అభిరుచులకూ సమయం
మంచి పుస్తకాలు చదవాలి.. నచ్చిన సినిమాను మళ్లీ చూడాలి.. ఇలాంటి చిన్న చిన్న కోరికలూ తీరనివారు చాలామందే ఉంటారు. కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉన్నవారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో పాత, కొత్త సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. కథలూ, కవితలు రాయటం.. బొమ్మలు గీయటం లాంటి పాత అభిరుచులను రుచి చూస్తున్నవారూ పెరుగుతున్నారు.
నాలుగేళ్ల తర్వాత అందర్నీ కలిశా
‘నాలుగైదేళ్ల తర్వాత తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. వేర్వేరు నగరాల్లో ఉంటున్న మా సోదరులు, సోదరి కూడా సొంతూరికి వచ్చారు. చాన్నాళ్ల తర్వాత అందరూ కలిసుకున్నాం. పిల్లలతో గడుపుతున్నాం. కాయగూరలు సహా ఇంట్లోకి కావలసినవన్నీ నేనే తెస్తున్నాను. పని ఒత్తిళ్ల నుంచి కొంత ఉపశమనం లభించింది’ అని ఒక ప్రభుత్వ అధికారి తన అనుభవాన్ని వివరించారు.
ఇదీ చూడండి