లాక్‌డౌన్ వల్ల ప్రైవేటు ఆసుపత్రులు ముందుగా తీసుకున్న వైద్యుల అపాయింట్ మెంట్లన్నింటినీ రద్దు చేశాయి. నెలవారీ చెకప్‌లకు వెళ్లే వారికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు.... ఆసుపత్రులకు వెళ్లలేని వారికి టెలీ మెడిసిన్ ద్వారా కొన్ని ఆసుపత్రులు వైద్య సాయం అందిస్తున్నాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారికి వీడియో కాల్ ద్వారా వైద్య చికిత్స అందిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్, వీడియో కాల్ ద్వారా వైద్యులను సంప్రదించేందుకు ఈ ఆసుపత్రులు ప్రత్యేకమైన నెంబర్లు ఇచ్చాయి. సాధారణ సమస్యలైతే ఫోన్లోనే ఏ ఔషధాలు వినియోగించాలో వైద్యులు చెబుతున్నారు. ఏదైనా శరీరంపై గాయాలు, ఈసీజీ, కార్డియాక్ సమస్యలు ఉన్నప్పుడు టెలీ మెడిసిన్ వీడియో కాల్ ద్వారా రోగులను వైద్యులు పరిశీలిస్తున్నారు.
టెలీ మెడిసిన్ సౌకర్యం ఉన్న ఆసుపత్రికి వైద్య సలహాల కోసం రోజుకు 500 నుంచి 600 మంది వరకూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీడియో ద్వారా ఒక్కో వైద్యుడు 20 నుంచి 25 మంది రోగులను పరిశీలించి వైద్య సలహాలు అందిస్తున్నారు. లాక్ డౌన్ వంటి సమయంలో టెలీ మెడిసిన్ విధానం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: వలస కూలీల ఆకలి తీర్చిన 'ఈటీవీ భారత్'