దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను రాష్ట్రంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వివిధ రకాల పూజలు, సభలు నిర్వహించి ప్రజలు అమ్మవారిని సేవించారు. కష్టాల నుంచి గట్టెక్కించాలని మొరపెట్టుకున్నారు. వివిధ జిల్లాల్లో ఉత్సవాలు ఈరోజు ఇలా సాగాయి.
కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో...
కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని పంచముఖ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో.. అమ్మవారికి త్రికాలార్చనలు నిర్వహించారు. ప్రత్యేక అర్చనలు, వేదస్వస్తి సహా విశేష హారతులు సమర్పించారు. నూజివీడులో మహిళా భక్తులు బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేదసభ ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో అమ్మవారికి.... తెలుగుదేశం నేత యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో దుర్గామల్లేశ్వరస్వామి దివ్యకళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్రకాశంలో...
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు మహా దుర్గ అలంకరణలో నంది వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు. కుంకుమార్చన, ఉత్సవ మూర్తికి అలంకరణ పూజ నిర్వహించారు. చీరాలలో శ్రీలక్ష్మీ అమ్మవారు, ద్రోణాదులలో శ్రీ అంకమ్మతల్లి అమ్మవార్లు మహిషాసుర మర్దినిగా అలంకరించారు.
విశాఖపట్టణంలో...
విశాఖ జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవి పేటలోని కనకదుర్గ అమ్మవారిని సింహ వాహనంపై ఊరేగించారు. వైకాపా పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవరాపల్లి మండలం బి.కింతాడలో ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు.. దుర్గమ్మను దర్శించుకున్నారు. బురుజుపేటలో కనకమహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు.
కర్నూలులో...
కర్నూలు జిల్లా శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి.. ప్రభుత్వం తరఫున మంత్రి గుమ్మనూరు జయరాం దంపతులు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్ఠింపచేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆదోనిలో వాసవీమాతకు ప్రత్యేక పూజలు జరిపారు. అంబాభవానీ దేవాలయంలో దుర్గాష్టమి సందర్బంగా రాత్రి చండీ హోమం జరిగింది. నగరేశ్వర ఆలయంలో వాసవి మాత భద్ర కాళీ అలంకరణలో, పట్టణ ఇలవేల్పు లక్ష్మమ్మ అవ్వకు అక్షింతల అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నంద్యాలలో శ్రీకాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు శ్రీ మహా గౌరి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రావణ వాహనంపై కొలువు తీరిన అమ్మవారికి గ్రామోత్సవం జరిపారు. చిన్న అమ్మవారిశాలలో దుర్గా దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దుర్గాదేవి హోమం, పీఠదేవత హోమం, కాశీ హోమం నిర్వహించారు.
అనంతపురంలో...
అనంతపురంలో మహిషాసుర మర్దిని అలంకారంలతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో.. అలంకార భూషితుడైన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతంగా నరసింహుడిని రంగ మండపంలో ప్రత్యేక పీఠంపై అధిష్టింప చేశారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని మల్లాలమ్మ గుడిలో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. శివకోటి ఆలయంలో అమ్మవారికి దుర్గా పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మవరంలో లలిత కళా నాటక నికేతన్ నాట్యాచార్యుడు బాబు బాలాజీ ఇంటిలో బొమ్మల కొలువు అందర్నీ ఆకట్టుకుంటోంది. మూడు దశాబ్దాలుగా ఆనవాయితీని కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కడపలో...
కడపలో విజయ దుర్గాదేవి ఆలయాన్ని విద్యుద్దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ఆవరణ మార్మోగింది. జమ్మలమడుగు పట్టణంలో అమ్మవారు మహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవాంబ, సాయిబాబా గుడి లో రాజరాజేశ్వరి అమ్మవారు సంతోషిమాతగా, అంబ భవాని, నాగుల కట్ట వీధిలోని అమ్మవారు మహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిశాలలో వాసవి కన్యకా మాత భక్తులకు త్రిపుర సుందరి రూపంలో దర్శనమిచ్చారు. బద్వేలు పట్టణంలో పార్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. పలు ఆలయాల్లో అమ్మవారి మూలవిరాట్టులకు భారీగా అలంకరణ చేయడంతో భక్తులు దర్శించుకుని తరించారు.
ఇదీ చదవండి: