సింహాచలం కొండల నుంచి విశాఖ నగరంలో 1,100 ఎకరాలను లాక్కోవడానికి కుట్ర జరిగిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లోని గ్రామాల నివాసితులకు ఇళ్లను ఖాళీ చేయాలని ఇటీవలే ప్రభుత్వం నోటీసులు ఎందుకు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. కర్మాగారంలో జరిగిన గ్యాస్ విషాదంపై లాగ్‌బుక్, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు అందుబాటులో లేవని ఉమా నిలదీశారు.
ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎందుకు విశాఖపట్నం సందర్శించలేదని ప్రశ్నించారు. పరిశ్రమ కార్యదర్శి రవీద్రనాథ్ రెడ్డిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. తన ప్రగతి భారతి ట్రస్ట్ కోసం కంపెనీ నుంచి ఏదైనా వసూలు చేశారా అనేది ఎంపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకం కోసం ప్లాస్టిక్ బాటిళ్ల సరఫరాను పెంచడం కోసమే జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్జీ పాలిమర్‌లకు యుద్ధ ప్రాతిపదికన అనుమతి ఇచ్చిందని ఉమా దుయ్యబట్టారు. ఎల్జీ పాలిమర్స్... నందిని, ఎస్పీవై, భారతి వంటి పాలిమర్ కంపెనీలకు ముడిసరుకును సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరపూరిత ఉల్లంఘనలకు పాల్పడిందని ఉమా ఆరోపించారు. జరిగిన పరిణామాలపై కేంద్రం లోతైన దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.