వైకాపా అసమర్థ, అవినీతి పాలన, బూతుల మంత్రి వైఖరి వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు 50 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. 2023లో ఎన్నికలు జగితే కేవలం ఐదు సీట్లు మాత్రమే వస్తాయన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయనే గర్వంతో ప్రతిపక్షాలపై అసభ్యకరంగా మాట్లాడితే.. బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమా పరిశ్రమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
సినిమా వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని గుడివాడలో గెలిచిన కొడాలి నానికి సినిమాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బూతుల మంత్రి భాషకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో నిజాలు బయటకు వస్తున్నాయని.., సీఎం బంధువులే వివేకాను హత్య చేశారని ఆరోపించారు. రాష్ట్రం చీకటి ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని.., బొగ్గు నిల్వలను భారతి సిమెంట్‌కు తరలించి కరెంటు ఉత్పత్తి లేకుండా చేశారని ఆరోపించారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే..
మాజీ మంత్రి వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భీమ్లా నాయక్ సినిమాపై వైకాపా ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. వివేకా కేసులో సీబీఐకి 15 మంది సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డి, అతని తండ్రి పాత్ర ఉందని చెప్పినా... సీఎం జగన్ ఎందుకు నోరు మెదపడంలేదని ఆయన ప్రశ్నించారు. జగన్ స్పందించకుంటే కుట్రలో ఆయన పాత్ర కూడా ఉందని భావించాల్సి వస్తుందన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణను ఎదుర్కోవాలన్నారు.
ఇదీ చదవండి