రాష్ట్రవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కృష్ణా జిల్లా...
7వ రోజు దసరా ఉత్సవాల్లో భాగంగా కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి త్రికాలార్చనతోపాటు చండీ సప్తశతి పారాయణ, చండీ హోమం, బాలార్చన, సువాసిని పూజ, శ్రీ చక్రార్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్య క్రమాలను కప్పగంతు లక్ష్మీ నారాయణ, జానకిరామ్ శర్మ నిర్వహించారు.
విజయవాడలోని అజిత్సింగ్ నగర్ శివారులోని కుందావారి కండ్రిక గ్రామంలోని శ్రీ కృష్ణ మందిరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించగా... తల్లి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
విశాఖ జిల్లా...
దేవీ నవరాత్రుల్లో భాగంగా విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి లక్ష గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శమిచ్చారు. కరోనా నేపథ్యంలో దేవాలయ సిబ్బంది.. మాస్కులతో వచ్చిన భక్తులకు మాత్రమే దర్శనాని పంపారు.
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశాఖ జిల్లా చోడవరంలోని దుర్గాదేవిని కరెన్సీ నోట్లతో ఆలంకరణ చేశారు. ఈ అలంకరణలో ఉపయోగించిన దాదాపు రూ. 2.45 లక్షల నోట్లను భక్తులు సమకూర్చారు. ఈ సందర్బంగా ఆమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా...
ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
ప్రకాశం జిల్లాలో...
యర్రగొండపాలెం నియజకవర్గంలో దేవీ శరన్నవారాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. త్రిపురంతాకంలోని బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమ్మవారు కళా రాత్రి అలంకరణలో గజ వాహనంపై, యర్రగొండపాలెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సరస్వతి దేవిగా అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు.
మార్టూరు మండలం ద్రోణాదులలోని శ్రీ అంకమ్మతల్లి అమ్మవారి దేవాలయంలో నవరాత్రులు కన్నులపండుగగా జరుగుతున్నాయి. అంకమ్మతల్లి.. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా దేవాలయ ప్రాంగణంలో శ్రీ తులసీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు.. బ్యాగులు, నోట్ బుక్స్, పెన్నులు,యూనిఫాం, బూట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్పూరపు సుధాకర్ బాబు, అళహరి పూర్ణచంద్రరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
దేవీ నవరాత్రుల నేపథ్యంలో మార్టూరు మండలం జొన్నతాళిలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శానంపూడి చైతన్య ఆధ్వర్యంలో అమ్మవారిని 59 లక్షల రూపాయల నగదు, కిలో బంగారంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మి దేవి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
దర్శిలో అద్దంకి రోడ్డులో కొలువైన కనకదుర్గమ్మను నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు సమకూర్చిన 23 లక్షల రూపాయల నగదుతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మి దేవి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా..
అమలాపురంలో కొలువైన శ్రీ వాసవి మాతను కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమలాపురం డివిజన్ అమలాపురం పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి మామిడికుదురులో గ్రామాల్లో మహిళలు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేశారు.
కొత్తపేట మండలం ఏనుగుమహల్లోని శ్రీచక్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితా మహా త్రిపురసుందరీ దేవి కొలువై ఉన్న ఈ ఆలయంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కుంకుమ పూజలు చేశారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. రాచపల్లి గ్రామం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా వచ్చి బోనాలతో ఒమ్మంగి దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామిశెట్టి రమేశ్, రామిశెట్టి విజయ్ భాస్కర్, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా...
జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చండీ హోమం, గణపతి హోమం నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తణుకులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు.. దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే సర్వశక్తి సామర్ధ్యాలు ప్రసాదిస్తుందని, సర్వ దుష్ట శక్తుల నుంచి కాపాడుతుందని భక్తులు నమ్మకం.
ఉంగుటూరు మండలం చేబ్రోలులోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రూ.7.50 లక్షలు విలువ చేసే కరెన్సీ నోట్లతో అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ చేశారు. నిడమర్రు మండలం మందలపర్రు గ్రామంలోని ఉమా నీలకంటేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారికి రూ.54 లక్షలతో నోట్లతో అలంకరించారు.
తణుకు మండలం మండపాక గ్రామంలోని ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శికున్నారు.
దేవీ నవరాత్రుల సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు దేవాలయాల్లో అమ్మవార్లు ధనలక్ష్మి అవతార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గంగానమ్మ నూకాలమ్మ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో దర్శనం భక్తులు కోసం తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. పలుచోట్ల మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.