రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ(డీఎంజీ) వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డీఎంజీ కార్యాలయంలో గనుల శాఖలో.. గనుల లీజుదారులతో ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్‌షాపుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలపై అవగాహన కల్పించారు. గనులశాఖలో అనేక నిబంధనలు సక్రమంగా అమలు చేయట్లేదని.. వాటిలోని లొసుగులను ఉపయోగించుకొని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెడుతూ.. మైనింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు, లీజుదారుల సమస్యలను గుర్తించేందుకు మైనింగ్ పాలసీపై సమగ్ర అధ్యయనం చేసినట్లు తెలిపారు.
మైనింగ్ పాలసీలో సంస్కరణలు
ప్రస్తుతం అమలులో ఉన్న పలు నిబంధనలను మరింత పటిష్ఠం చేయడంతోపాటు లీజుదారులకు ప్రోత్సాహకరంగా ఉండేలా మైనింగ్ పాలసీలో ప్రభుత్వ అనుమతితో సంస్కరణలను తీసుకువచ్చాం జాతీయస్థాయిలో మైనర్ మినరల్స్‌లో రాష్ట్రం 24శాతం సామర్ధ్యం కలిగి ఉందని.. అపారమైన ఖనిజ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, మరోవైపు మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు చేయూతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. వేలం నిర్వహించడం వల్ల లీజుదారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా గనుల లీజుల మంజూరీలో ప్రీమియం లేనివి పెంచారు. ఈ పెంపుదల సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను గనులశాఖ అధికారులు శాస్త్రీయంగా పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకుంది.
క్యూబిక్ బేసెస్ బదులు టన్నేజ్ విధానం
గ్రానైట్ మైనింగ్‌లో క్యూబిక్ బేసెస్‌కు బదులుగా టన్నేజీ విధానాన్ని తీసుకువచ్చామని అన్నారు. రాజస్థాన్‌లో ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైన తరువాతే దానిని ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. ఈ విధానాన్ని పలువురు లీజుదారులు కూడా స్వాగతించినట్లు తెలిపారు. గతంలో మైనింగ్ లీజుల కోసం లీజుదారులు అటు రెవెన్యూ, ఇటు మైనింగ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని.. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే లీజులు మంజూరు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల కొత్తగా మైనింగ్ రంగంలోకి వచ్చే వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించినట్లు అవుతోందని అన్నారు.
మినరల్స్ సీనరేజ్ ఫీజును థర్డ్ పార్టీతో వసూలు
గనులశాఖలో పరిమితమైన మానవ వనరులున్నందున మైనర్ మినరల్స్‌కు అనుమతి ఇచ్చే క్రమంలో సీనరేజీ ఫీజుల కలెక్షన్స్‌ను థర్డ్ పార్టీ ద్వారా చేస్తున్నామని అన్నారు. ఇందుకు గానూ రెండుమూడు జిల్లాలను కలిపి తదితర వివరాలను అధ్యయనం చేసి వచ్చిన దానిపై 25 శాతం పెంచి మైనింగ్ ఆదాయం పెంచేలా వేలం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి..
HIGH COURT: ఆ ప్రవేశాలు కొనసాగించండి..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు