Department of Health Principal Secretary: బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవదానానికి వారి కుటుంబ సభ్యులను మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరముందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను 8 మందికి అమర్చే అవకాశముందని చెప్పారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో నిర్వహించిన జీవన్ దాన్ వర్క్‌షాప్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్లుగా శిక్షణ పొందిన వారికి ధృవపత్రాలను అందజేశారు. అవయవదానంపై ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కృష్ణబాబు సూచించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఓపిగ్గా కౌన్సిలింగ్ నిర్వహించి వారివారి కుటుంబ సభ్యుల్ని ఒప్పించాలన్నారు. జీవన్ దాన్ కార్యక్రమం కింద హార్వెస్ట్డ్ ఆర్గాన్స్ అన్నీ ఏపీ ప్రజల అవసరాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు.
రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీలతోపాటు మరో 16 మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు కృష్ణబాబు వెల్లడించారు. హెల్త్ హబ్‌లకు ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయిస్తోందని తెలిపారు. వైద్యారోగ్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక వైఎస్సార్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండేలా రాష్ట్రంలో పదివేలకు పైగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్ర వైద్యారోగ్య రంగం పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉంటుందని కృష్ణబాబు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి