రాష్ట్రంలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. సడలింపు వేళలను యథాతథంగా కొనసాగించాలన్నారు. చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ రెండు డోసులు వేయించాలని, ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, బ్లాక్ ఫంగస్, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలపై సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు.
ముఖ్యమంత్రి: కొవిడ్‌తో తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేసి సరైన పథకాల్లో మదుపు చేయాలి. నెలనెలా వారి ఖర్చుల కోసం వడ్డీ వచ్చేలా చూడాలి.
అధికారులు: కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 92 మంది పిల్లలను గుర్తించాం. ఇంతవరకు 43 మందికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించాం.
మే 16న పాజిటివిటీ రేటు 25.56శాతంగా నమోదుకాగా.. మే 30 నాటికి 15.91శాతానికి తగ్గింది. అర్బన్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు 2,632 కేసులు.. రూరల్‌లో ఆ సంఖ్య 1,859గా ఉంది. క్రియాశీలక కేసులు 1.6 లక్షలకు తగ్గాయి. మే 7న రికవరీ రేటు 84.32శాతం కాగా.. ప్రస్తుతం 90శాతంగా ఉంది. 104కు వచ్చే ఫోన్లు తగ్గాయి. మే 3న 19,175 రాగా మే 29కి అవి 3,803కు తగ్గాయి. ఇది కూడా కొవిడ్ తగ్గుదలను సూచిస్తోంది.
ముఖ్యమంత్రి: బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు అందుబాటులోకి తేవాలి. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.
అధికారులు: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు 1,179. అందులో 97 మందికి నయమైంది. 14 మంది చనిపోయారు. 1,068 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ రాని వారికీ బ్లాక్ ఫంగస్ వస్తోందని తేలింది. కొవిడ్ రాకపోయినా 40 మంది దీని బారినపడ్డారు. ప్రధానంగా మధుమేహం ఉన్న వారికి అధికంగా వస్తోంది. కేంద్రం కేటాయింపుల ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంజక్షన్ల కోసమూ కృషి చేస్తున్నాం.
ముఖ్యమంత్రి: ఆక్సిజన్ సేకరణ, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వ చేసే ట్యాంకులు ఉండాలి.
అధికారులు: ఆక్సిజన్ వినియోగం 490 టన్నులకు తగ్గింది. మే 29న 654 టన్నులు సేకరించాం. స్థానికంగా ఉత్పత్తి 230 టన్నులు ఉంది.
ఇదీచదవండి.