అమరావతిలోని సచివాలయంలో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన మధ్యాహ్న భోజన పథకంపై రాష్ట్రస్థాయి
స్క్రీనింగ్
ఆండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సీఎస్ సూచించారు. విద్యార్థులకు, చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పారు. పథకం అమలుకు సంబంధించిన బిల్లులను ప్రతీ 3నెలలకొకసారి సకాలంలో విడుదల చేయాలని విద్యా, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లు నిర్దిష్ట పరిమాణం, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో పథకం అమలుకు ఉత్తమంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. పాఠశాలల వద్ద ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.
మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రస్తుతం.. ప్రతి పాఠశాలకు ఏడాదికి సరఫరా చేస్తున్న 12 సబ్సీడీ సిలిండర్ల సంఖ్యను 16 కు పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 16 వేల 689 కిచెన్ షెడ్లను నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేసిందని.. ఒక్కో షెడ్ నిర్మాణానికి 2లక్షల 90 వేల రూపాయల వ్యయం అవుతందని తెలిపారు. పదేళ్ల క్రితం నిర్మించిన 11వేల 690 వంటగదులు, ఫేజ్-1 కింద మంజూరైన 31 వేల 213 వంటగదులను మరమ్మతులు చేసేందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిష్పత్తి నిధులతో మరమ్మతులు చేసేందుకు అనుమతి లభించిందని పాఠశాల విద్యాశాక కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. ఒక్కో వంటగది మరమ్మతు కోసం 10 వేల ఖర్చవుతుందన్నారు. గతేడాది మధ్యాహ్న భోజన పథకం కింద 539 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వివరించారు.
ఇది కూడా చదవండి.