రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. దీపాలతో పండుగకు ప్రజలంతా ఆహ్వానం పలుకుతున్నారు. పూలు, ప్రమిదల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కళకళలాడిపోతున్నాయి. అయితే పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీపావళి అంటేనే టపాసుల మోతమోగాల్సిందే. ఇక చిన్నారుల హడావుడి సంగతి చెప్పేదేముంటుంది. అయితే టపాసుల రేట్ల ధరలు మండిపోతున్నాయి. కొవిడ్ వల్ల గతేడాది బాణసంచాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈసారి సడలించినా ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. పిల్లలతో కలిసి దుకాణాలకు వెళ్లిన తల్లిదండ్రులు పెరిగిన ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు.
విజయవాడలో బాణసంచా దుకాణాల వద్ద అంతగా సందడి కనిపించడం లేదు. గతంతో పోల్చితే ధరలు అధికంగా ఉన్నాయని జనం అంటున్నారు. పిల్లల ఉత్సాహం కోసం కొనక తప్పడం లేదని చెబుతున్నారు. టపాసులు ధరలు పెరగడంతో కొనేవారి సంఖ్య కూడా తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు.
కర్నూలులోనూ దీపావళి సందడి వాతావరణం కనిపించింది. అయితే గతంతో పోల్చితే పూజాసామగ్రితోపాటు టపాసులు ధరలు మూడింతలు పెరిగాయని ప్రజలు వాపోతున్నారు. పెట్రో ధరల పెంపు అన్నింటిపైనా పడిందని వ్యాపారులు వివరించారు. కరోనా ఆంక్షల కారణంగా బాణసంచా తయారీ తగ్గడం కూడా ఒక కారణమని తెలిపారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జోరువానలతో కొనుగోళ్లు మందగించాయి. నెల్లూరులో 4 రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన కురుస్తుండటంతో పండుగ ఉత్సాహం అంతగా కనిపించడం లేదు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో దీపావళి సందడి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. బాణాసంచా అమ్మే దుకాణాల వద్ద కొనుగోలు దారులు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నారు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు పండుగ జరుపుకుందాం అనుకుంటున్నా... ధరల మోత వారి ఆనందానికి అడ్డుకట్ట వేస్తోంది.
ఇదీ చదవండి: