ఆన్‌లైన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా ఉద్ధృతిని నియంత్రించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిర్దుష్ట చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 12,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదై.. 69 మంది మరణించడం బాధ కలిగించిందన్నారు. రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల పరీక్షలు చేయించుకునేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటి ఫలితాలు వచ్చేందుకు మరో నాలుగైదు రోజుల పమయం పడుతోందన్నారు.
హృదయం ద్రవిస్తోంది..
కరోనా రోగులకు వైద్యం అందక, పడకలు, ఆక్సిజన్ దొరకక అష్టకష్టాలూ పడుతున్నారని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక ఐదుగురు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉందని గుర్తు చేశారు. పరిమితికి మించి మార్చురీల్లో శవాలు గుట్టలుగా పడి ఉంటున్నాయన్నారు. శ్మశానాల్లో అంత్యక్రియల కోసం భౌతికకాయాలు బారులుతీరి ఉండడం.. కొన్నిచోట్ల సామూహిక దహనాలు జరగడం హృదయాన్ని ద్రవింపజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే పలు ప్రాంతాల్లో కొవిడ్ బాధితులను తీసుకువెళ్లేందుకు అంబులెన్సుల డ్రైవర్లు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇంతటి విలయంలోనూ కనీస మానవత్వం లేకుండా ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారన్నారు. వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు.
ఇదీ చదవండి: కర్ణాటకలో రెండు వారాల పాటు కర్ఫ్యూ
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?
మహా విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదలాల్సిన తరుణంలో.. గ్రామాలకు ఇంటర్నెట్పై సమీక్ష జరపడం అవసరమా అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాల్సిన వేళ.. ఇతర అంశాల సమీక్షలకు, కక్షపూరిత రాజకీయాలకు, ప్రతిపక్షాలపై వేధింపులకు ఆస్కారమివ్వడం తగదని హితవు పలికారు. మహమ్మారి విలయం సృష్టిస్తుంటే పరీక్షల పేరుతో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం విచారకరమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అత్యంత వేగంగా కరోనా సోకే ప్రమాదం ఉందని ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. ఆయా పరీక్షలు రద్దు చేసి ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు రూ. 5 వేల రూపాయల ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యావసర వస్తువులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కరోనా కట్టడికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని.. రాజకీయాలకు అతీతంగా వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఆక్సిజన్ కొరత..రోగులకు తప్పని కష్టాలు