ఎన్నికల సమయంలో 25మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు మాట మార్చడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం బలంగా ఉన్నందున హోదా ఇవ్వాలని గట్టిగా అడగలేమని.. అయినా పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పడం తగదన్నారు.
విజయవాడలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైకాపా, తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు విశాఖలో భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన పేరు చెప్పి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్వయంగా ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పడం పరిస్థితికి నిదర్శనమన్నారు.
విశాఖలో భూ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా పోస్టింగులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫోన్ టాపింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై హైకోర్టు న్యాయమూర్తులు కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని కోరారు.
ఇవీ చదవండి:
గ్రామ స్వరాజ్యం గురించి సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదం: యనమల