రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో నేటి నుంచి సంక్రాంతి పండుగ వరకు సీపీఐ ఆధ్వర్యంలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఆదివారం కడప శివారులో నిర్మించిన టిడ్కో నివాసాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 18 నెలల క్రితమే నిర్మాణాలు పూర్తయినా నివాసాలను పేదలకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.
సీపీఐ ఇచ్చిన పిలుపుతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీపీఐ నేతలను గృహ నిర్బంధం చేశారు. కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. మరికొన్ని చోట్ల ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి సంబంధించిన షెడ్యూలును పురపాలక కమిషనర్లు ప్రకటించారు. కృష్ణా జిల్లాలో నిర్మిస్తున్న 27 వేల 872 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రెచ్చగొట్టే వారి ప్రభావానికి లోనుకావద్దన్నారు. నూజివీడులో టిడ్కో ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉందని..పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు అందిస్తామని పురపాలక కమిషనర్ రషీద్ ప్రకటన విడుదల చేశారు. ప్రకాశం జిల్లాలోనూ టిడ్కో సీఈ అదే మాట చెప్పారు. ఈ నెల 20లోపు 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని.. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో టిడ్కో ఇళ్ల వద్ద 144 సెక్షన్ విధించినట్లు కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు.
విజయవాడ నగర శివారులోని వాంబేకాలనీ, జేఎన్‌యూఆర్‌ఎం కాలనీలోని అద్దె ఇళ్లల్లో ఉండే వారి వద్దకు వాలంటీర్లు వెళ్లి ఎవరూ సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొనవద్దని గట్టిగా చెప్పారు. ఆందోళనల్లో పాల్గొంటే ప్రభుత్వం నుంచి వచ్చే అమ్మఒడి, పింఛన్లు ఆగిపోతాయని హెచ్చరించారు. టిడ్కో గృహాల వద్ద ఆందోళనల్లో పాల్గొనకుండా సీపీఐ నేతలను గృహనిర్బంధం చేయాలని కడప జిల్లా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.
విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాజధాని ప్రాంతంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేయనున్నారు.
ఇదీచదవండి