మంత్రి బొత్స సత్యనారాయణ ఒక బ్లఫ్ మాస్టర్లా తయారయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. టిడ్కొ గృహాల విషయంలో అబద్దపు ప్రకటనలు చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో పూర్తైన టిడ్కొ ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు జంకుతున్నాయని.. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ఏ రకంగా ఇళ్లను పూర్తిచేసి ఇస్తారో స్పష్టంచేయాలన్నారు. రాజధాని అంశంలో వాదనలకు రైతులు గడువు కోరితే ఏదో కుట్ర ఉందని మంత్రి బొత్స అసత్య ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు వారం గడువు అడిగితే..ప్రభుత్వ న్యాయవాదులు మరింత గడువు అడిగినట్లు గుర్తుచేశారు.
వైకాపా అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా.. గత ప్రభుత్వం హాయాంలో పూర్తైన టిడ్కొ గృహాలను పంపిణీ చేయకుండా మాయమాటలతో కాలక్షేపం చేస్తోందని తెదేపా నాయకులు ఆలపాటి రాజా అన్నారు. ఊరు చివర నివాసయోగ్యం కానీ భూమిని ఇచ్చి పేదలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి.. PROTEST: ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు