కరోనా నిర్ధారణ అయి ఎలాంటి లక్షణాలు లేకుండా తెలంగాణలోని గాంధీలో చికిత్స పొందుతున్న బాధితులను హోం క్వారంటైన్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా 50 ఏళ్ల వయసులోపు ఉన్న దాదాపు 315 మందిని ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ సమాచారం ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులకు(డీఎంహెచ్‌వో) అందించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
హైదరాబాద్ గాంధీలో ప్రస్తుతం 500 మంది వరకు కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గాంధీలో గరిష్ఠంగా 1500 మందికి మించి చికిత్స అందించే మౌలిక వసతులు లేవు. కరోనా బాధితుల్లోని కొందరిలో కనీసం జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కన్పించడం లేదు. ఇలాంటి వారిలో వైరస్ లోడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని హోం క్వారంటైన్‌లో పెట్టి మందులు అందించినా ఇబ్బంది ఉండదని అధికారులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం.
షరతులు వరిస్తాయి
- లక్షణాలు లేనంత మాత్రాన అందర్నీ హోం క్వారంటైన్‌కు పంపరు. 50 ఏళ్లులోపు వయసుండాలి. ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉండకూడదు.
- తక్కువ వయసున్నాసరే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తారు.
- శిశువులు, గర్భిణులు, వృద్ధులు, కేన్సర్, కిడ్నీ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు ఇబ్బందులున్న వారిని ఆసుపత్రిలోనే ఉంచాలి. పూర్తిగా నయం అయ్యాకే డిశ్ఛార్జి చేస్తారు.
- ఇప్పటికే ఆయా కుటుంబాల్లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు, వృద్ధులు, గర్భిణులు, శిశువులుంటే మాత్రం హోం క్వారంటైన్‌కు కాకుండా అధికారులు సూచించిన ప్రదేశాల్లో ఉండేందుకు అవకాశమిస్తారు.
జిల్లావైద్యాధికారులదే బాధ్యత
- హోం క్వారంటైన్‌కు తరలించడం నుంచి ఔషధాల సరఫరా, ఇతర జాగ్రత్తల బాధ్యతలు డీఎంహెచ్‌వోలు తీసుకోవాలి.
- ఇంటికి తరలించే ముందు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు ముద్ర వేయాలి. ఈ సమయంలో ఇంట్లో వారిని సైతం కలవకుండా ప్రత్యేక గదిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వారిని నిత్యం పర్యవేక్షిస్తుండాలి.
- సొంత ఇల్లు లేనివారు.. ఒకే గది ఉన్న వారి బాధ్యతలను అధికారులే తీసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ వసతి గృహాలు, లేదంటే ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించి వీరిని క్వారంటైన్ చేసి ఆహారం, ఔషధాలు అందించాలి.
- బాధితులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. తినే కంచం నుంచి అన్ని వస్తువులు ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి.
ఇవీ చూడండి...